శంకరయ్య చాలా అదృష్టవంతుడు. అతనికి చాలా చక్కని కన్య భార్యగా లభించింది,పెండ్లి అయిన తరువాత కొన్నాళ్ళకు అతనికి వినికిడి కొంచెం తగ్గింది. అది అంతటితో ఆగలేదు. క్రమేపీ పెరగుతూ వచ్చింది. చివరికి బ్రహ్మచెవుడుగా మారింది. రోజులు గడిచిన కొద్దీ అతనికి ప్రజలతో సంబంధం లేకుండా పోయింది. అందరూ "చెవిటిమాలోకం! నీతో మాకు పనేంటి"అనేవారు.

ఒక రోజున అతని అత్తవారింటి నుండి ఒక కబురు వచ్చింది. వాళ్ల మామ గారి ఆరోగ్యం బాగుండలేదట "మామ గారిని చూడడానికి వెళ్లకుంటే లోకులు కాకుల్లాగా పొడుస్తారు. మాటలంటారు పైగా నాకు గర్వం అని అంటారు. అందుచేత తప్పకుండా వెళ్లి ఆయన్ని చూసి రావాలి"అనుకున్నాడు కానీ తనకు చెవుడు తో పెద్దకష్టం వచ్చిపడిందే.! "దీంతో ఎట్లా నెగ్గుకురావాలి.? ఏం చేయాలి?"అని పదేపదే ఆలోచించి సాధారణ కుశల ప్రశ్నలను కొన్నింటిని రాసుకుని, వాటికి ఏ ఏ జవాబులు వస్తాయో కూడా వ్రాసుకుని అనేక మార్లు వాటిని చదివి గుర్తు చేసుకున్నాడు.

మొదటి ప్రశ్న  :-. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది.
జవాబు          :-   ఇప్పుడు కొంచెం బాగానే ఉంది.
తాను అనవలసినమాట:- నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది.
రెండవ ప్రశ్న.   :-మీరు ఇప్పుడే మందు వాడుతున్నారు.?
జవాబు:- (ఏదో మందు పేరు)
తాను  అనవలసిన మాట:-.  బాగుంది !అదే మీకు తగిన మందు.
మూడవ ప్రశ్న:- మీకు వైద్యం ఎవరు చేస్తున్నారు?
జవాబు:- (ఏదో డాక్టర్ పేరు)
అప్పుడు తను చెప్పవలసిన మాట:- ఆయనే మీకు తగిన మంచి డాక్టరు. ఆయనకే అన్ని వదిలేయండి. ఆయనే మిమ్మల్ని రోగ విముక్తుని చేస్తారు.
       

 "ఇంకేం పర్వాలేదు. అందరూ మెచ్చేలాగా మాట్లాడుతాను."అనుకొని వెంటనే బయలుదేరి అత్త వారి ఇంటికి చేరుకున్నాడు. వెళ్లినవెంటనే మామ గారిని "మీ ఆరోగ్యం ఇప్పుడేలా ఉంది.?"అని అడిగాడు. అందుకు ఆయన "ఇప్పుడేమీ బాగాలేదు"అన్నాడు తాను అనుకొన్న జవాబు వచ్చింది. అనుకొని శంకరయ్య "నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది". అన్నాడు ఇతని మాటలు విన్న మామగారు అవాక్కయ్యారు.
   
శంకరయ్య "మళ్లీ ఇప్పుడే మందు తీసుకుంటున్నారు"? అని అడిగాడు.. ఆయన కోపంగా "విషం" అన్నాడు తాను ఊహించిన జవాబేవచ్చి ఉంటుందనుకున్న శంకరయ్య "మీకు ఆమందే బాగా పనిచేస్తోంది."అన్నాడు. మళ్లీ "మీకిప్పుడు ఏ డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు?"అని మామ గారిని అడిగాడు. అప్పటికే అతని దోరనికి విసుగుచెందిన మామగారు కోపంతో ఊగిపోతూ "యమధర్మరాజు"అన్నాడు..అది కూడా తను ఊహించిన జవాబే అనుకొన్న శంకరయ్య "ఆయనే మంచి డాక్టరు మీ బాధ్యతలన్నీ ఆయనకే వదిలేయండి. ఆయనే మిమ్మల్ని రోగ విముక్తుని చేస్తాడు."అన్నాడు
 
మామగారికి కోపం కొచ్చి చిర్రెత్తుకొచ్చింది. ఒక్క ఉదుటున వెళ్లి శంకరయ్య ను పట్టుకొని ఒక తోపుతో బయటకు గెంటి. "ఛీ! ఇకపై నీ మొఖం నాకు చూపవద్దు. పో! అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: