దేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపుకుంటున్న వేళ.. అయోధ్యలో మరో అద్భుత సంఘటనకు అంకురార్పణ జరిగింది. అదే నేడు అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంగళవారం (జనవరి 26) ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అయోధ్యలోని ధనీపూర్‌ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. రామమందిరం నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి ఈ ప్రదేశం 25 కి.మీ. దూరంలో ఉంది. ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ ఆధ్వర్యంలో ఈ మసీదు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ నేతలు సహా హిందూ సంఘాల నుంచి ముగ్గురు ప్రతినిధులు పాల్గొన్నారు.



ఇక అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ చారిత్రక తీర్పు వెలువడిన ఆర్నెళ్ల లోపే అక్కడ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడం గమనార్హం. ఇక మసీదు నిర్మాణానికి విరాళం అందించిన మొట్టమొదటి వ్యక్తి కూడా హిందువే కావడం గమనార్హం. లక్నో యూనివర్సిటీకి చెందిన రోహిత్ శ్రీవాస్తవ గతేడాది మసీదు నిర్మాణానికి రూ.21 వేలు విరాళంగా అందించారు. తాజాగా అవధ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్‌కే సింగ్, ఆయన సతీమణి డాక్టర్ సునీతా సెంగార్ రూ.22 వేల విరాళం అందించారు. ఆరెస్సెస్ నాయకుడు అనిల్ సింఘ్ రూ.2100 విరాళం అందించారు. భారత్‌లో మత సామరస్యానికి ఇది మంచి నిదర్శనమని పలువురు ప్రశంసలు కురిపించారు. ‘మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది’ అని జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ తెలిపారు. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండో - ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ గత డిసెంబర్‌లో మసీదు నమూనాను ఆవిష్కరించింది. సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం చేపడుతున్నారు. మసీదుపై భారీ గాజు గోపురం ఏర్పాటు చేయనున్నారు. బాబ్రీ మసీదు కంటే అనేక రెట్లు గొప్పగా మసీదు నిర్మాణం చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదు. ట్రస్ట్‌ సభ్యులందరూ త్వరలో సమావేశమై మసీదు పేరును నిర్ణయించనున్నారు. ఏది ఏమైనా గణతంత్ర దినోత్సవం నాడు మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగటం చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: