ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. అంతకుముందు 4 టీ20ల్లో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్‌ను చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేసిన కోహ్లీ.. తానే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మార్పు టీమిండియాకు అద్భుతంగా ఉపయోగపడింది. రోహిత్, కోహ్లీ వికెట్ పడకుండా ఏకంగా 94 పరుగుల పార్ట్‌నర్‌‌షిప్ నెలకొల్పారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో కామెంట్ చేశాడు. రోహిత్-కోహ్లీ కాంబినేషన్ పెరుగు-జిలేబీ కాంబినేషన్‌లా చాలా డెడ్లీ కాంబినేషన్ అని అన్నాడు.

సాధారణంగా ఉత్తర భారతదేశంలో చాలా మంది జిలేబీన పెరుగుతో తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ వీరిద్దరినీ వాటితో పోల్చాడు. ‘హిట్‌మ్యాన్ రోహిత్, రన్‌ మెషిన్ విరాట్ ఓపెనింగ్ రావడం చూసినప్పుడు నాకు ఈ 'డెడ్లీ కాంబినేషన్' గుర్తుకొచ్చింది. అంటూ పెరుగు, జిలేబీ ఫొటోను తన ట్విటర్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
                                             
కాగా.. వీరూ ట్వీట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ‘వీరూ.. నువ్వన్నది నిజమే.. ఇది నిజంగానే డెడ్లీ కాంబినేషన్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘సర్.. ఎంతైనా సచిన్-సెహ్వాగ్ అంత కాదులేండి’ అని కామెంట్ చేశాడు. ఇక మరికొందరైతే.. ‘శనివారం రోహిత్-కోహ్లీ ఓపెనింగ్, ఆదివారం సెహ్వాగ్-సచిన్ ఓపెనింగ్. ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆదివారం శ్రీలంక లెజెండ్స్-ఇండియా లెజెండ్స్ మధ్య రోడ్ సేఫ్టీ వరల్డ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: