ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మేనేజ్‌మెంట్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్ చూపిస్తున్న ఉదారత బౌలర్ విషయంలో ఎందుకు కరువవుతోందని నిలదీశాడు. అయితే బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చినందుకు తనకేం అభ్యంతరం లేదని, బౌలర్‌కు కూడా ఆ అవకాశం లభించాలనేదే తన ఆలోచన అని సెహ్వాగ్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించడంపై మీడియాతో మాట్లాడిన వీరూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మొదటి వన్డే కోసం ప్రకటించిన తుది జట్టులో యుజ్వేంద్ర చహల్‌కు చోటు దక్కకపోవడంపై వీరూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆటగాళ్ల ఎంపికలో తప్పు చేస్తోందని అన్నాడు.

'జట్టు మేనేజ్‌మెంట్‌ తుది జట్టు ఎంపిక ప్రక్రియలో బౌలర్ల, బ్యాట్స్‌మెన్ల మధ్య పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. ఇందుకు ఉదాహరణ.. కేఎల్‌ రాహుల్‌‌, చాహల్‌. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో మొదటి 3 మ్యాచ్‌ల్లో చాహల్‌ నిరాశపరిచే ప్రదర్శనను కనబరచడంతో మిగిలిన రెండు టీ20ల్లో అతడిని తొలగించారు. అదే సమయంలో రాహుల్‌ తాను ఆడిన నాలుగు టీ20ల్లోనూ ఘోరంగా విఫలమైనా మళ్లీ వన్డే జట్టులోకి తీసుకున్నారు. అదేమంటే అత్యత్తమ ఆటగాడికి మరిన్ని అవకాశాలివ్వాలని అంటున్నారు. మరి చాహల్‌కు ఆ అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదో నాకర్థం కావడంలేదు.

నా ఉద్దేశం రాహుల్‌‌కు అవకాశం ఇవ్వడం తప్పని కాదు. అతడు తొలి వన్డేలో మునుపటి ఫామ్ అందుకున్నాడు. అర్థ సెంచరీతో రాణించాడు. చాహల్‌కు కూడా అలాంటి అవకాశం దక్కి ఉంటే అతడు కూడా నిరూపించుకునేవాడేమో. బ్యాట్స్‌మన్‌కు ఇచ్చిన అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలనే అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తపరుస్తున్నా. చాహల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకోవడం వరకు బాగానే ఉన్నా.. అతను వికెట్లు తీయకపోగా.. పరుగులు దారాళంగా ఇచ్చుకున్నాడు. ఇప్పటికైనా టీం మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా’ అంటూ వీరూ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: