ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో ప్లాస్టిక్ వినియోగించ‌డం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే వాదనలు తరచూ వింటాం.. అయినా, మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూనే ఉంటాం. య‌థావిధిగా ప్లాస్టిక్‌ను య‌థేచ్ఛ‌గా వాడుతుంటాం. ప్లాస్టిక్ బాటిళ్లను ఎండలో ఉంచినప్పుడు, వాటి నుండి క్యాన్సర్‌కు కారణం అయ్యే రసాయనాలు విడుదలవుతాయని, అవి నీటిలో కరిగి శరీరంలోకి చేరుతాయనే ప‌రిశోధ‌న‌ ఇప్పుడు భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది.


అయితే, శాస్త్రీయంగా బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం గురించి కొన్ని ఆందోళనలు  క‌లిగిస్తున్నాయి. పాలికార్బోనేట్ కంటైనర్లు, ఫుడ్ బాక్స్ లైనింగ్‌లతో పాటు రసీదులు, స్టాంప్‌లలో ఉపయోగించే కాగితంలో బీపీఏ రసాయనం ఉంటుంది. బీపీఏ ఒక స్త్రీ హార్మోన్ లాగా ప్రభావం చూపిస్తూ హాని కలిగించే అవ‌కాశం ఉంది. అయితే, ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విష‌యం ఇంకా స్ప‌ష్టం కాలేదు.

బీపీఏ హానికరమని ఆధారాలు ఉన్నాయా?

   బీపీఏ అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు, ఎలుకలకు, ముఖ్యంగా గర్భంతో ఉన్న ఎలుక‌లు లేదా చాలా చిన్న ఎలుకలకు హాని కలుగుతుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కానీ, మానవుల్లో బీపీఏ వంటి రసాయనాలను చాలా భిన్నంగా జీర్ణమయ్యే అవ‌కాశం ఉంది.  ప్రస్తుతం మనిషి శరీరంలోకి ప్రతిరోజూ వెళ్ళే బీపీఏ హాని కలిగిస్తుందో లేదో చెప్పడానికి బలమైన ఆధారాలు ఏం లేవ‌నే చెప్పాలి.

   ఫుడ్ ప్యాకేజింగ్ లో బీపీఏను చాలా సంవత్సరాలుగా వాడుతున్నారు.  అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది పెద్ద వయసు ఉన్న వారి మూత్రంలో బీపీఏ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ప‌రిశోధ‌కులు. అయితే, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో బీపీఏని ఉపయోగించకపోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించే అవ‌కాశం ఉంది. చాలా ప్లాస్టిక్‌ పరికరాలపై  ముద్రించి ఉన్న నంబ‌ర్ ద్వారా వాటిలో బీపీఏ ఉందో లేదో గుర్తించవచ్చు.



బీపీఏని ఎలా గుర్తించాలి?

త్రిభుజాకార రీసైక్లింగ్ చిహ్నం (♲) లోపల నెంబర్‌ ముద్రించి ఉంటుంది. 1, 2, 4 లేదా 5 అంటే ప్లాస్టిక్  బీపీఏ రహితం అని అర్థం. 3 లేదా 7 ఉంటే ప్లాస్టిక్‌లో బీపీఏ ఉండే అవ‌కాశం ఉంటుంది. మీరు ప్లాస్టిక్‌ని వేడి చేస్తే లేదా డిటర్జెంట్‌ని పోస్తే, దాని నుండి బీపీఏ విడుదల అవుతుంది. ప్లాస్టిక్‌పై 6 నెంబ‌ర్ ఉంటే అది పాలీస్టైరిన్‌తో తయారు చేశార‌న్న మాట.

యూరోపియన్ యూనియన్‌లో, పిల్లల సీసాలు, బొమ్మల కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌లు తప్పనిసరిగా 'బీపీఏ- రహితంగా' ఉండాలి అనే నిబంధ‌న ఉంది. అయితే, ఆహారం డబ్బాల లైనింగ్‌లు, వేడికి స్పందించే రసీదులు ఇప్పటికీ బీపీఏని కలిగి ఉంటాయి. అందువల్ల సాధారణ జీవితంలో బీపీఏని నివారించడం దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: