మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినము. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.


నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది.


అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.


విష్ణుమూర్తి ఫోటోను:పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.


ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనం, లక్షతులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున విష్ణుసహస్రనామస్తోత్రమ్, విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకములను సన్నిహితులకు ఇవ్వడం మంచిది.

భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా:


ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద పొందు పరచిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అందురు. ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మతర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.


సంకల్పం: మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ భౌమవాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ!!


భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే – అపపౌ స్పృశ్య
౧. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
౨. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
౩. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! 
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!


మరింత సమాచారం తెలుసుకోండి: