స్త్రీలు గృహంలోని పనులు చేయడానికో, భర్త అడుగుజాడల్లో నడుచుకోవడానికో భూలోకంలో పుట్టినట్లుగా పలు గ్రంథాల్లో రాసినట్లు, పలువురు పలురకాలుగా చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు హిందూ ధర్మం, సమాజం, పురాణాలు ఏవిధంగా గౌరవం ఇచ్చాయో, వాటిని ఏ విధంగా తీసుకోవాలనేది చాలామందికి తెలీదు. వేల సంవత్సరాలు రాసిన గ్రంథాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎవరో ఒకరు ఏదోరూపంలో తమకు తెలిసిన ధార్మిక చింతన, అర్థాలతో వాటి అర్థాల్ని మార్చేస్తున్నారు. పురుషుడు పుట్టుకు మూలకారకం స్త్రీనే. అలాంటి స్త్రీనే దేవతగా కొలిచే ధర్మం మనది. అలాంటి స్త్రీకి పట్టపుయోగంతోపాటు బానిసలుగా మార్చిన కథలు చరిత్రను తవ్వితే చాలానే వస్తాయి. కానీ స్త్రీ ఎప్పటికీ గౌరవప్రదమైన మూర్తే. 

 

అలాంటి స్త్రీలు పురాణాల్లో దేవుల్ని సైతం సత్యం, ధర్మం కోసం నిలదీసిన సందర్భాలున్నాయి. ఎన్నో ఏళ్ళుగా పలు ధార్మిక సంస్థలు వారి గురించి వెల్లడిస్తున్న కథలు చాలానేవున్నాయి. ఇస్కాన్‌ సంస్థకానీ మరో సంస్థకానీ స్త్రీకి గౌరవప్రదమైన స్థానాన్ని ఆపాదిస్తూ ప్రవచనాలు, ఉపన్యాసాలు ఇస్తూ ఉత్తేజితుల్ని చేస్తున్నారు. మన పురాణాల్లో అలాంటి స్త్రీ మూర్తులు ఎందరో వున్నారు. వారిలో గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవశ్వతి, యామి, పౌలమి, సూర్య, శ్వాస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జుహు, మైత్రేయి వంటి ఎందరో వేదాలలో ఉదాహరించిన స్త్రీ మూర్తులు.

 

 వేదాలను  స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతిలో చెప్పారని చేస్తున్న వితండవాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాను. వేదాలను నేర్చుకొని వాటి సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరు.అలాగే మహిళాయోగులు, స్త్రీ ఋషులు, యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం. కాని వీరిని ఋషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి. ఋగ్వేదంలో 23 మంది ఋషికలు సూక్తులు దర్శించారు. అపాల దర్శించిన సూక్తికి ఆమె పేరు మీదనే అపాలసూక్త‌మని పిలుస్తారు.

 

విశ్వవర ఐదవ మండలంలోని 28 వ సూక్తిని లోపాముద్ర 19వ సూక్తిని దర్శించారు. ఋగ్వేదంలో 125 సూక్తిని  జుహు దర్శించింది. గార్గి ఋ షిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది. వేదకాలనిర్ణయం 5000 సంవత్సరం నుండి 1500 క్రితం సంవత్సరాల కాలంనాటివని భావిస్తే అప్పటికే స్త్రీవిద్యకు అత్యంత విలువలు ఇచ్చినట్లు భావించాలి. వేదాలకు భాష్యాలు చెప్పడమంత సులభమైన ప్రక్రియేమికాదు. వేదాలను క్షుణ్ణంగా చదవాలి, అంటే మంచిగా జ్ఞానసముపార్జనతోపాటు విద్యను అభ్యసించాలి.

 

ఇప్పటికి 1500 క్రిందటవరకు స్త్రీలకు అన్ని రంగాలలోనూ సమాన అవకాశాలుండేవి. వృత్తులు కులాలవారిగా ఏర్పడటంతో, కులవ్యవస్థ జఠిలమైంది. సమాజంలో  సనాతనధర్మరక్షణ పేరుతో అనేక కట్టుబాట్లు, అచారాలు, వ్యవహారాలు పుట్టుకొచ్చాయి. మూఢనమ్మకాలు ప్రబలాయి. అలా పుట్టిన మూఢనమ్మకాలకు స్త్రీలోకం సమిధైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: