మ‌న హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది.  సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో హ‌నుమంతుడిని కొలుస్తారు. హనుమంతుని గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. పట్టణాలలో అయితే హనుమంతుని దేవాలయాలు చెప్పనక్కర్లేదు. అయితే అందులో కొన్ని ప్ర‌సిద్ధి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో బేడి ఆంజనేయస్వామి దేవాలయం ఒక‌టి. ఈ దేవాల‌యంలో హ‌నుమంతుడిని బేడీల‌తో బంధించారు. ఆ క్షేత్రం ఏమిటి? ఎందుకు బంధించారు? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

బేడి ఆంజనేయస్వామి వారి దేవాలయం.. తిరుమ‌ల శ్రీవారి సన్నిధికి తూర్పు మాడా వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. ఇక్కడి ఆంజనేయస్వామికి బేడి ఆంజనేయుడని పేరు రావడానికి కార‌ణం కూడా ఉంది. ఆంజనేయుడు బాలునిగా ఉన్నప్పుడు ఒక ఒంటె కోసం అడవుల్లో వెకతడం మొదలు పెట్టాడు. ఆయనలా అడవుల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఆయ న తల్లి అంజనాదేవి ఆయన చేతులకు బేడీలు వేసేదని చెబుతారు. ఒక సారి ఆమె హిమాలయాలకు వెళ్ళాల్సి వస్తానని అంతవరకూ బేడీలు వేసి కదలకుండా ఉండమని చెప్పింద‌ని అంటారు.

 

అయితే అంజనా దేవి కొన్ని కారణాల వల్ల వెనక్కు రాలేకపోయింది. ఆమె రాక కోసం హనుమంతుడు బేడీలతో వేచి చూస్తూ ఈనాటికీ అక్కడే ఉండిపోయాడని చెబుతారు. అయితే వేంకటేశ్వరస్వామి మాత్రం హనుమంతుని వదిలేయలేదు. ఆంజనేయునికి ఆహారం పెట్టమని పూజారులను ఆదేశించారు. అందువల్ల వేంకటేశ్వరునికి, వరాహ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత దానిని బేడి ఆంజనేయునికి కూడా నివేదిస్తుంటారు. కొండ పాదయాత్ర ముగిసిన తర్వాత భక్తులు ఈ ఆంజనేయ‌ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం పూజా నివేదనాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: