బాబా తన భోధనల ద్వారా మనుషుల్ని సాధన మార్గంలో ఒక్కొక మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపించారు. మహిమలతో కాదు మానవత్వంతో బతకాలని చాటిచూపారు. సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడనని చెప్పుకున్న నినయ భూషణుడు. బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం! బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్ట బుద్దులు, ఆవ లక్షణాలను రూపుమాపుతాయి. బాబా మహిమలు మనో వికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అలముకున్న సాయి తత్త్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది.
బాబా తన చక్కని, సరళమైన భోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్దరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి? ఏది మంచి? ఏది చెడు? అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. బాబా చూపింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి. యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికి సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే షిర్డీ సాయి స్వరూపమై వెలుగొందుతోంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి