మరి కొందరైతే వినాయక చవితి నాడు తెచ్చి పూజ చేసిన గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తుంటారు. అందుకు బదులుగా గత సంవత్సరం తెచ్చుకున్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుంటారు. విఘ్నాలను పారదోలే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. అలాంటిది ఆ పర్వదినాన హిందువులందరూ వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకుని పండ్లు పలహారాలు సమర్పించి గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపి, ఆరోజు కానీ మూడవ రోజు కానీ లేదా 5వ రోజు కానీ నిమజ్జనం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే ఇలా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకొని పూజించడం మంచిది కాదని వేద పండితులు చెబుతున్నారు. అసలు వినాయకుడి విగ్రహాన్ని ఇంటి లోపల ఉంచరాదని పురాణాలు సైతం చెబుతున్నాయి.
పూజ అనంతరం ఆరోజు లేదా మూడు లేక అయిదవ రోజున గణేష్ విగ్రహాన్ని తప్పకుండా నిమజ్జనం చేయాలని శాస్త్రాలు అంటున్నాయి. అంతేకాక వినాయకుని విగ్రహం బదులు, గణేశుని చిత్ర పటాలను ఇంటి లోపల పెట్టుకుని పూజ చేయడం మంచిదని చెబుతున్నారు. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనం కోరుకునే ఆ గణేశుడి చిత్ర పటం తప్పకుండా మన పూజా మందిరంలో ఉండాలి. అంతేకాక నిత్యం పూజలు కూడా చేయాలి. అప్పుడే దేవుళ్ల చల్లని చూపు మనపై ఉంటుంది. ప్రథమంగా ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు తొలుత వినాయకుడికి పూజ చేసి వేడుకోవాలి.. అప్పుడే విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి