నిన్న మొన్నటి వరకు అయోధ్య రామ మందిరంపై చెలరేగిన వివాదాలు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ఆ శ్రీ రాముని పరమ భక్తుడు హనుమంతుని జన్మస్థలంపై కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. హనుమాన్ జన్మస్థలం ఇక్కడే అంటూ ఒకరు చెబుతుంటే, మరొకరు ఆధారాలు చూపించండి అంటూ వాదనకు దిగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. విషయానికొస్తే, హనుమంతుని జన్మ స్థలం తిరుమలే అంటూ..ఆయన ఈ పవిత్ర భూమిపైనే జన్మించాడు అంటూ టీటీడీ ఇటీవలే చేసిన ప్రకటనపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చేసిన ఈ ప్రకటనకు అర్థం లేదని అసలు ఇందులో ఏమాత్రం సత్యం లేదని తేల్చి చెప్పింది కర్ణాటక హనుమాన్ జన్మ భూమి తీర్ధక్షేత్ర ట్రస్టు. 

హనుమాన్ తిరుమలలో జన్మించాడు అనడం భావ్యం కాదని తప్పు పట్టింది. అయితే టీటీడీ  ప్రకటనను ఖండించిన కర్ణాటక  ట్రస్టు ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తూ ఆరు పేజీల లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో పలు విషయాలను ప్రస్తావించి టీటీడీపై ప్రశ్నల దాడి చేసింది.  హనుమాన్ అక్కడే జన్మించాడు అని చెప్పడానికి ముందు దాన్ని నిరూపితం చేయాలని కోరింది.  అనవసరంగా అనాలోచితంగా అజ్ఞానంతో ఇటువంటి మూర్ఖపు ధోరణి ప్రదర్శించవద్దని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇందులో ఎంత నిజముందో ప్రపంచానికి ప్రకటించే ముందు ఆధారాలతో సహా నిరూపించాలని ఆ తర్వాతే ఈ అంశంపై మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి కల్పితాలు సృష్టిస్తే వాటిని నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరన్న విషయాన్ని గ్రహించాలి అంటూ ఘాటుగా స్పందించింది.  

అంతే కాదు మీ ప్రకటనలో వాస్తవం ఉంటే వారంలోగా శాస్త్రీయ ఆధారాలతో తమ లేఖకు సమాధానం  చెప్పి హనుమాన్ జన్మస్థలం ఎక్కడన్న విషయాన్ని తేల్చి చెప్పాలని హెచ్చరించింది. కాబట్టి వారంలోగా హనుమాన్ జన్మస్థలంపై  ఆధారాలతో సహా స్పష్టం చేయాలని పేర్కొంది. మరి ఇప్పుడు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఇందుకు ఎలా స్పందిస్తుందో... శాస్త్రీయ ఆధారాలతో ఎలా నిరూపిస్తుందో  తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: