కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా దసరానవరాత్రుల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలు కనుల పండగ లగా సాగుతాయి. ఆ సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమలకు క్యూ కడతారు. 
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ ఉండే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని  చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఆ సమయంలో మొదటి రోజు స్వామి వారికి కట్టే ఆ నేత పంచెలు ఏంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంతకీ ఆ పంచెల్ని ఎక్కడ తయారు చేస్తారో తెలుసా , అయితే కింద చదవండి . స్వామి వారికి కట్టే ఆ పంచెలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జోగులంబా గద్వాల జిల్లాకు చెందిన చేనేత కార్మికులు తయారు చేస్తారు. ఆ చేనేత కార్మికులు నెల రోజుల పాటు ఏంతో నియమ నిష్ఠలతో పంచెలను నెసేందుకు అంచులకు నాణ్యమైన పట్టునూ, మిగతా భాగం నులనూ ఉపయోగిస్తారు.పది మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పుతో నేసిన ఈ పంచెల అంచుకు ఎక్కువ భాగం ఎరుపు , ఆ పైన ఆకుపచ్చ , బంగారు వర్ణాల పట్టు పంచెల్ని మూల విరాట్టు స్వామి వారికి కట్టే సంప్రదాయం సుమారు 350 సంవత్సరాలు పై నుంచే కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని ఏరువాడ గా పిలిచే గద్వాల ప్రాంతాన్ని పాలించిన సంస్థానాధీశులు ప్రారంభించగా ఆ సంప్రదాయాన్ని నేటికి వారి వారసులు కొనసాగిస్తున్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థాన వారసులు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డా ప్రతి ఏటా శ్రావణమాసంలో తామే స్వయంగా గద్వాల వచ్చి చేనేత కార్మికులతో నేయించిన ఏరువాడ జోడు(తెలంగాణ ప్రాంతంలో జోడు అంటే రెండు) పంచెలు స్వయంగా తామే తిరుమలకు తీసుకు వెళ్లి స్వామి వారికి సమర్పిస్తున్నారు. 
అంతేకాకుండా సంస్థాన వారసులు పంచెల్ని సమర్పించాక ప్రధాని అర్చకులు " గద్వాల ఏరువడా జోడు పంచెలు వచ్చాయి " అని స్వామి చెవిలో మూడు సార్లు చెబుతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సంస్థానాధీశుల వారసుల చేత స్వామి వారికి హారతి ఇప్పించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: