ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ఏడేళ్లపాటు క్రికెట్‌కు దూరమై ఎట్టకేలకు తిరిగి మళ్లీ మైదానంలోకి దిగాడు పేసర్ శ్రీశాంత్. 2013 ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న శ్రీశాంత్ ప్రస్తుతం కర్ణాటక దేశవాళీల్లో ఆడుతున్నాడు. అక్కడి నుంచి జాతీయ జట్టులోకి వచ్చేందుకూ సిద్ధమవుతున్నాడు. అంతేకాదు ఐపీఎల్‌లో కూడా సత్తా చాటాలని తెగ ఆశపడుతున్నాడు. అతడి ఆశలకు కొన్ని ఫ్రాంచైజీలు కూడా పట్టునిస్తున్నాయి.  బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలిగే శ్రీశాంత్ తమ జట్టులో ఉంటే బలం పెరుగుతుందని కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

కేరళకు చెందిన ఈ కుడిచేతి వాటం పేసర్‌ ఒక దశలో టీమ్ ఇండియాలో ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అతడి ఎగ్రెసివ్ నెస్, టెంపర్ యువతకు తెగ నచ్చేది. కానీ కెరీర్‌లో రికార్డులకంటే వివాదాలతోనే శ్రీశాంత్ ఎక్కువగా ప్రచారం పొందాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ -2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలనూ ఎదుర్కొని పూర్తిగా టీమిండియాకే దూరమయ్యాడు. అయితే తాను ఏతప్పూ చేయలేదని, మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెడతానని శ్రీశాంత్ అప్పటినుంచీ ఆశాభావంతోనూ ఉన్నాడు. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో తనను ఏదో ఒక జట్టు వేలంలో తీసుకుంటుందని శ్రీశాంత్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ను వేలంలో తీసుకునేందుకు చెన్నై, పంజాబ్, రాజస్థాన్ జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో శ్రీశాంత్ పంజాబ్ తరపున ఆడాడు. అంతేకాడు ఆ జట్టుతో ఉన్నప్పుడు గొప్ప ప్రదర్శనలు కూడా చేశాడు. ఈ క్రమంలోనే శ్రీశాంత్‌ను తమ జట్టలోకి తీసుకునేందుకు పంజాబ్ ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. నాణ్యమైన పేస్ బౌలింగ్ లేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ విజయాలకు దూరమవుతోందనే వాదన ఆ జట్టు అభిమానుల్లో ఉంది. బ్యాంటింగ్ విభాగంలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ కరువవడం వల్లే మ్యాచ్‌లు గెలవలేకపోతున్నట్లు జట్టు మేనేజ్‌మెంట్ కూడా గ్రహించింది. ఈ క్రమంలోనే శ్రీశాంత్ వంటి అనుభవం ఉన్న పేస్ బౌలర్‌ను తీసుకుంటే జట్టుకు లాభం చేకూరుతుందని పంజాబ్ భావిస్తోంది.

పంజాబ్ తరువాత శ్రీశాంత్‌పై ఆసక్తిగా ఉన్న ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్. గత ఐపీఎల్‌లో రాయల్స్ జట్టు అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ఈ జట్టులో పేరున్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. 2021 సీజన్‌కు ముందు వరుణ్ ఆరోన్‌ను మేనేజ్‌మెంట్ వదులుకుంది. దీంతో ఈ ఒక ఇండియన్ పేసర్‌కు జట్టులో స్థానం ఉంది. ఐపీఎల్‌లో మంచి అనుభవంతో పాటు పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీయడంలో శ్రీశాంత్‌ అందెవేసిన చేయి. ఒకవేశ శ్రీశాంత్‌ను జట్టులోకి తీసుకుంటే బౌలింగ్ విభాగం బలపడుతుందని రాయల్స భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిక్సింగ్‌ ఆరోపణల్లో ఇరుక్కున్నప్పుడు శ్రీశాంత్ రాయల్స్ తరపునే ఆడుతున్నాడు. శ్రీశాంత్‌తో పాటు రాయల్స్‌కే చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఫిక్సింగ్‌లో ఇరుక్కున్నాడు.

పంజాబ్, రాజస్థాన్ తరువాత శ్రీశాంత్‌పై ఆసక్తిగా ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై.. గత సీజన్లో మాత్రం స్థాయికి తగ్గట్టు రాణించలేదు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ చెన్నై పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే 2021 సీజన్‌కోసం భారీ మార్పులు చేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది. ఇప్పటికే సీనియన్ ప్లేయర్లు చాలామందిని చెన్నై వదులుకుంది. గతంలో ధోని కెప్టెన్సీలో శ్రీశాంత్ భారత జట్టు తరపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. కెప్టెన్ అంచనాలకు అందుకోవడంలో అతడు ఎప్పుడూ విఫలం కాలేదు. దీంతో అంచనాలకు అనుగుణంగా ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న శ్రీశాంత్‌పై ధోనీ దృష్టిసారించే అవకాశాలు లేకపోలేదు.

అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. శ్రీశాంత్‌ను జట్టులోకి తీసుకోబోతున్నట్లు ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటించలేదు. శ్రీశాంత్ వైపు నుంచి కూడా పలానా ఫ్రాంచైజీకి తాను ఆడాలనుకుంటున్నట్లు ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలో జరగబోయే ఐపీఎల్-2021 వేలంతో శ్రీశాంత్ ఐపీఎల్ పునరాగమనంపై సస్పెన్స్ వీడిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: