గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాల నుంచి పేలవ ప్రదర్శనలతో తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలోనే కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే ఇంటి బాట పట్టింది.


 అయితే బాబర్ కెప్టెన్సీ పై విమర్శలు రావడంతో ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త ఆటగాళ్ల చేతిలో కెప్టెన్సీ పెట్టింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఆట తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. చివరికి సొంత గడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లలో కూడా తేలిపోతుంది ఆ జట్టు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న జాకా ఆశ్రఫ్ ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ ను బాగు చేయడం నావల్ల కాదు అంటూ ఆయన చేతులెత్తేసారు. దీంతో కొత్తగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పాక్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జాకా ఆశ్రఫ్ పై మాజీ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత ఏడాది జరిగిన  వరల్డ్ కప్ లో జట్టు దారుణ ప్రదర్శనకు అష్రఫ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. కీలకమైన టోర్నీకి జట్టును బోర్డు సెలెక్ట్ చేయలేదు అంటూ చెప్పిన అశ్రఫ్ మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అంటూ కామెంట్ చేశాడు ఇంజమామ్. అతను బాధ్యత లేకుండా వ్యవహరించాడు అంటూ మండిపడ్డాడు. కాగా వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత చీఫ్ సెలెక్టర్గా ఉన్న ఇంజమామ్ ను అష్రఫ్ తొలగించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: