కరోనా దెబ్బకి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఇళ్లలో ఉండలేక విసుగెత్తిపోయారు. అయితే కొంతమంది మాత్రం ఖాళీగా కూర్చోలేక తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. ఒడిశాలోని మథూర్‌భంజ్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ కూడా అలాంటి ఓ చిన్న ప్రయోగమే చేసి అతి పెద్ద ఆవిష్కరణ చేశాడు. స్వతహాగా రైతు అయిన అగర్వాల్.. దేశీయ పరికరాలతో నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశాడు. పైగా ఈ వాహనం ఎలక్ట్రిక్ బ్యాటరీతోనే కాకుండా సోలార్ ఎనర్జీతో నడిచేలా ఈ వెహికల్‌ను డిజైన్ చేశాడు.
ఇక ఈ వాహనంలో సుశీల్.. 850 వాట్ల మోటార్, 100ఎహెచ్/54 ఓల్ట్స్ బ్యాటరీని అమర్చాడు. పెట్రోలు ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు చక్కటి ప్రత్యామ్నాయమని, అందుకే ఈ ఆలోచన చేశానని సుశీల్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ బ్యాటరీ సుమారు 8 గంటలలో పూర్తిగా ఛార్జ్ అవుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకూ నడుస్తుందని సుశీల్ చెబుతున్నాడు.అలాగే ఈ బ్యాటరీ 10 ఏళ్ల పాటు పనిచేస్తుందని వివరించాడు. ప్రస్తుతం ఈ ఒక్క ఆవిష్కరణతో సుశీల్ పేరు స్థానికంగా విపరీతంగా వినిపిస్తోంది. తమ గ్రామానికి చెందిన రైతు ఇలాంటి ఆవిష్కరణ చేయడం తమకు కూడా ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి