అగ్రరాజ్యం అమెరికాలో చదవడం ,.. ఉద్యోగం సంపాదించడం భారతీయుల కల. ఆ కలను నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమించాల్సిందే. అమెరికాలో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి తమ కల నెరవేర్చుకున్న భారతీయులు ఎందరో ఉన్నారు. మనదేశం నుంచి వెళ్లిన వాళ్లు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగానే సెటిల్ అయ్యారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. కొందరయితే అమెరికాలో గౌరవప్రదమైన పదవుల్లో సత్కరించబడి భారతదేశ కీర్తిని ఇనుమడింపచేశారు.

అలాంటి వాళ్లలో ఒకరు సరితా కోమటిరెడ్డి. తెలంగాణ మూలాలున్న సరితా కోమటిరెడ్డి సాధించిన ఘనతతో భారతదేశ కీర్తి పతాకం మారోసారి ఎగిరింది. అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ కోర్టు జడ్జిగా తెలంగాణ సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న కాలంలో గత ఏడాది ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సరిత తల్లిదండ్రులు నల్గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన వారు. భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్, తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్. సరిత పుట్టి పెరిగింది అంతా అమెరికాలోనే.

చిన్ననాటి నుంచే ప్రతిభ చూపించిన సరిత హార్వార్డ్ యూనివర్శిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. అది కూడా డిస్టింక్షన్ లో పాసయ్యారు. లా పట్టా తీసుకున్న తర్వాత కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు జడ్జి బ్రెట్ కెవనా దగ్గర అసిస్టెంట్ గా చేరింది. అమెరికాలోని అతి పెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ బీపీ డీప్ వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ లో న్యాయ సలహాదారుగా పనిచేసింది సరిత.

2018లో ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీ లాండరింగ్ డిప్యూటీ చీఫ్ గా , కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్ గా పనిచేసింది. ఈస్టర్న్ కోర్టులోని అమెరికా అటర్నీ ఆఫీస్ జనరల్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ గానూ సరిత పనిచేసింది.అంతేకాదు ఆమె కొలంబియా లా స్కూల్ లో న్యాయశాస్త్రం బోధించింది.

జూనియర్ లాయర్ గా ఎక్కడైతే తను అనుభవం సంపాదించిందో.. జడ్జి బ్రెట్ కెవనా సిఫార్సు మేరకే సరితను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ట్రంప్ నియమించినట్టు తెలుస్తోంది. మన తెలుగమ్మాయి అమెరికాలాంటి అగ్రరాజ్యంలో అత్యున్నత పదవి సాధించడం నిజంగా మనమందరం గర్వించదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: