జీవితంలో మనం చేసే ఏ పనినైనా ఇష్టంతో చేస్తే ఫలితం ఒక విధంగా ఉంటుంది... కష్టంతో చేస్తే ఫలితం మరొక విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇష్టంతో చేసే పనిలో మనం ఎల్లప్పుడూ మెరుగైన ఫలితం కోసం... విజయం కోసం చేస్తాం. అదే ఇష్టం లేకుండా చేసే పనిపై పెద్దగా శ్రద్ధ పెట్టము. అందువల్ల ఫలితాలు ఇష్టంతో చేస్తే ఒక విధంగా.... ఇష్టం లేకుండా చేస్తే మరో విధంగా ఉంటాయి. 
 
సాధారణంగా కొన్ని పనులు మనకు మొదట్లో కష్టంగా అనిపిస్తాయి. కానీ ఆ పనులపై ఆసక్తిని పెంచుకోవడం ద్వారా వాటిపై ఇష్టం ఏర్పడుతుంది. అలా చేసే పనిని ఇష్టంగా చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కష్టం కాదు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తాను చేసే పని వల్ల లాభం ఏంటి..? ఉపయోగం ఏమిటి...? అనే విషయాలను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా ఆలోచించడం మొదలుపెడితే భవిష్యత్తు బంగారంలా మారుతుంది. 
 
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆటలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని... తెలివితేటలు బాగానే ఉన్నా చదువు విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయని చెబుతూ ఉంటారు. వారు పిల్లలను దగ్గరకు తీసుకుని జీవితంలో చదువు యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వివరిస్తే వారిలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. పిల్లలకు తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయో గ్రహించి వారు చేస్తున్న తప్పులను సరిదిద్దితే వారు ఉన్నత స్థానాలకు సులువుగా ఎదిగే అవకాశం ఉంటుంది. 
 
ఇలా చేస్తే పిల్లలు నిజంగా మారతారా...? అని చాలామంది సందేహం వ్యక్తం చేయవచ్చు. ఏ పనికైనా మన వంతు మనం కష్టపడితే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. సాధారణంగా పిల్లలు చిన్నచిన్న తప్పులు చేస్తూ ఉంటారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్లు చేసిన తప్పు ఏంటి...? ఆ తప్పు వల్ల జరిగే నష్టం ఏంటి...? అనే విషయాలను వివరిస్తే వాళ్లలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. పిల్లలకు చిన్నతనం నుంచే ఇష్టంతో కష్టపడి విజయాన్ని సాధించడం అలవాటు చేస్తే వారికి బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: