వాళ్లిద్దరూ స్పోర్ట్స్ వుమెన్. వేరు వేరు జట్లకు ఆడుతూ.. ప్రత్యర్థులుగా తొలిసారి కలిశారు. అయితే వారి ప్రయాణం మాత్రం అక్కడితో ఆగలేదు. పెళ్లి దాకా దారి తీసింది. ఇదంతా కెనడియన్ అలెనా షార్ప్, అమెరికన్ సారా బోమన్ గురించే. వీరిద్దరూ రీక్రియేషనల్ హాకీ ఆడుతూ కలిశారు. మ్యాచ్ పూర్తయ్యే సరికి ఇద్దరూ ఒకరినొకరు ప్రత్యర్థులుగా, అలాగే గొప్ప ఆటగత్తెలుగా గుర్తించారు.

దీంతో వారి స్నేహం మొదలైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చాలా సరదాగా కాలం గడిపేశారు. ఈ సమయంలోనే అమెరికాలో కరోనా విజృంభించడం, దాంతో లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడం జరిగిపోయింది. ఇక వీళ్లిద్దరూ కూడా ఆరిజోనాలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. అక్కడ ఉండగా వారి బంధం మరింత బలపడింది. దీంతో ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని.

అంతే తమకు దగ్గరలో ఉన్న కొందరు స్నేహితులను పిలిచారు. తమ థెరపిస్ట్ సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరి పెళ్లిని వర్చువల్ గా స్ట్రీమ్ చేస్తే వంద మందిపైగా దాన్ని వీక్షించారు. ఈ తతంగం మొత్తం నవంబరు 23న లాక్ డౌన్ లో జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి గోల్ఫ్ ఆడుతూ తమ హనీమూన్ గడిపేశారు. గోల్ఫ్ అంటే ఇష్టం ఉన్న జంటలన్నీ ఇలానే చేస్తాయట మరి. ఇప్పటికే సారా, అలెనా జంట ప్రపంచం మొత్తం కలిసి చుట్టేశారు. అలాగే వీళ్లిద్దరూ కలిసి ఒకే జట్టు తరఫున ఒలింపిక్స్‌కు కూడా వెళ్లి వచ్చారు.

ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన వీరిద్దరూ  2006లో కెనడా తరఫున రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ లో కలిసి పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. మరి మనం కూడా ఈ కొత్త జంటకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా?

మరింత సమాచారం తెలుసుకోండి: