న్యూయార్క్: భార్యాభర్తల బంధం గురించి ఎన్నో కథలు, సినిమాలు చూస్తూనే ఉంటాం. అనేక సినిమాల్లో భర్త అనారోగ్యం పాలైతే భార్య తన భర్తను చంటి పిల్లాడిలా అన్ని దగ్గరుండి చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవడం వంటి సన్నివేశాలను చూశాం. కానీ.. భార్య ఒక్క మాటతో కోమాలో ఉన్న భర్త కోలుకున్నాడంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాలో ఇటువంటి సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో గిల్‌మర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. జూలై నెలలో గిల్‌మర్‌ కరోనా బారిన పడ్డాడు. హోం క్వారంటైన్‌లో ఉన్నప్పటికి గిల్‌మర్‌కు కరోనా తగ్గలేదు. విపరీతమైన దగ్గు వల్ల నిద్ర పోవడం కూడా కష్టం అయింది. దీంతో అతడు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఆసుపత్రిలో ఉన్న సమయంలో గిల్‌మర్‌కు విపరీతంగా జ్వరం వచ్చింది. తన భర్తకు ఫీవర్ 104 ఉందంటూ వైద్యులు భార్యకు చెప్పారు. గిల్‌మర్‌ను కోమాలోకి పంపడం తప్ప వేరే మార్గం లేదని, అలా చేయకుంటే తన భర్త ప్రాణాలకు చాలా ముప్పు ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆ తరువాత చికిత్స అందించే సమయంలో గిల్‌మర్ భార్య తన భర్త పక్కనే కూర్చొని ‘‘నీకేం కాదు. నిన్ను డాక్టర్లు చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు త్వరగా కోలుకుంటావు’’ అని చెవిలో చెప్పింది. ఆ మాట గిల్‌మర్‌కు స్పష్టంగా వినిపించినట్టు కోమా నుంచి బయటకు వచ్చిన తరువాత చెప్పాడు.

‘‘నిజంగా చెప్తున్నా.. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి. ఆమె నా దేవత. నేను కోలుకొని ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే దానికి తనే కారణం. ఈ రాత్రి గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అన్న రోజు తను ఎలా గడిపిందో నాకు తెలీదు. కానీ నేనైతే అంత ధైర్యంగా ఉండగలననే నమ్మకం నాకు లేదు. అందుకే తను నా దేవత’’ అంటూ తన భార్య గురించి ఎంతో గొప్పగా గిల్‌మర్ చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: