ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజాగా విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు కీలక సూచనలు చేసారు. ఐఎండి వాతావరణ సూచనలు ప్రకారం రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.
విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు... మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని సూచించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం అన్నారు.