శ్రీ‌వారి స‌ర్వ‌ ద‌ర్శ‌నం టికెట్ల‌ను శ‌నివారం టీటీడీ విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించిన ఈ టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిన్న‌నే ప్ర‌త్యేక‌ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విష‌యం విధిత‌మే.  రోజుకు 10వేల చొప్పున  స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది టీటీడీ.  ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు  రోజుకు 12వేలు చొప్పున టికెట్ల‌ను నిన్న‌నే అందుబాటులో ఉంచింది. ఇక నవంబ‌ర్ నెల‌కు సంబంధించిన గ‌దుల బుకింగ్‌ను అక్టోబ‌ర్‌ 25 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి స‌ర్వ‌ద‌ర్శ‌నం,  ప్ర‌త్యేక‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను, గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాల‌ని వెల్ల‌డించింది.  ఒక‌వేళ రూ.300 టోకెన్లు ల‌భించ‌క‌పోయినా స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. ఇక‌నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు  క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించింది. రెండు డోసులు వ్యాక్సిన్  పూర్త‌యిన స‌ర్టిఫికెట్‌, ద‌ర్శ‌నానికి మూడు రోజుల ముందు కోవిడ్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ తీసుకురావాల‌ని వెల్ల‌డించింది. ఇది ఇలా ఉండ‌గా శ‌నివారం విడుద‌ల చేసిన ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు  హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. కేవ‌లం 22 నిమిషాల్లోనే 3 ల‌క్ష‌ల టికెట్ల‌ను భ‌క్తులు పొందారు. న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో 3ల‌క్ష‌ల టికెట్ల‌ను విడుద‌ల చేసింది టీటీడీ.  విడుద‌ల చేసిన 22 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడు పోవ‌డంతో టీటీడీ ఆశ్చ‌ర్య‌పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: