ఈ భారీ రాజీనామాలతో రాజపక్స ప్రభుత్వం కాస్తా మైనారిటీలో పడిపోయింది. రాజపక్స నియమించిన ఆర్థిక మంత్రి అలీ సబ్రీని 24గంటల్లోనే రాజీనామా చేశారు. అసలే సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో కీలకమైన చర్చలు జరుపుతోంది శ్రీలంక. సరిగ్గా ఈ చర్చల సమయంలోనే ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో శ్రీలంకలో అంతటా సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కేబినెట్‌ను రద్దు చేసిన రాజపక్స.. యూనియన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని విపక్షాలకు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. రాజపక్స ఆఫర్‌ను ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. మరోవైపు దేశంలో నెలకొన్న ధరల పరిస్థితిపై జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇక ఇప్పుడు రాజకీయంగా ఏం జరుగుతున్నది అంతుబట్టకుండా ఉంది. రాజపక్స కొత్త ప్రధానిని నియమిస్తారా.. లేక మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది తేలాల్సిఉంది. శ్రీలంకలో నిత్యావసరాల కొరతలను నిరసిస్తూ జనం ఆందోళన బాట పట్టి ఇప్పటికి నెల రోజులకుపైగా అయ్యింది. శ్రీలంకలో చాలా చోట్ల పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. చివరకు మందులు లేక ఆస్పత్రులు మూతపడే దుస్థితి ఉంది. నిత్యావసరాల కొరత సంగతి ప్రత్యేకంగా చెప్పేపని లేదు. దీంతో రాజపక్స కుటుంబం రాజీనామా చేయాల్సిందేనని జనం డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశ పార్లమెంట్ సమీపంలోనే నిరసనలు జరుగుతున్నాయి. పోలీసులు బాష్పవాయు గోళాలతో, జల ఫిరంగులతో ఆందోళనలను అడ్డుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి