రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటివి సెంటిమెంట్‌పై ఆధారపడి పని చేస్తుంటాయి. ఒక్కసారి ఈ సెంటిమెంట్ దెబ్బతింటే.. ఇవి కొన్నాళ్లపాటు కోలుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఒమిక్రాన్ భయంతో వణుకుతున్న సమయంలో ఇండియాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటన్న చర్చ బిజినెస్ సర్కిళ్లలో వినిపిస్తోంది. మొన్న కొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్‌ను ఈ ఒమిక్రాన్ భయం వెంటాడింది. దాదాపు వారం రోజుల పాటు మార్కెట్లు రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఇలాంటి నెటిటివ్ సెంటిమెంట్ ఉన్న సమయాల్లో ఇలాంటివి సాధారణంగానే ఉంటాయి.


అయితే.. మరి ఈ ఒమిక్రాన్ ప్రభావం రియల్ ఎస్టేట్‌పై ఎలా ఉంటుంది.. అయితే రియల్ ఎస్టేట్‌పై ఒమిక్రాన్ ఏమాత్రం ప్రభావం చూపించడం లేదని రియల్టర్ల సంఘం క్రెడాయ్‌ చెబుతోంది. కొత్తగా వెలుగుచూసిన కొవిడ్‌-19 వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని క్రెడాయ్ తెలిపింది. అంతే కాదు.. రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో వృద్ధి కొనసాగే అవకాశం ఉందని రియల్టర్ల సంఘం క్రెడాయ్‌ చెబుతోంది. పండగల సీజన్‌ తర్వాత కూడా ఈ స్తిరాస్తి అమ్మకాల జోరు కొనసాగవచ్చని క్రెడాయ్ అంచనా వేస్తోంది.


భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30కు చేరవైంది. అయినా.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణ వేగానికి ఎటువంటి ఆటంకాలు ఉండకపోవచ్చని క్రెడాయ్ అంటోంది. ఒకవేళ రాబోయే నెలల్లో కేసులు గణనీయంగా పెరిగితే తప్ప ప్రాజెక్టుల పూర్తిపై ఒమిక్రాన్ ప్రభావం ఉండదని క్రెడాయ్ చెబుతోంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇప్పటికే కొవిడ్‌ రెండు వేవ్‌ల నుంచి ఎన్నో పలు పాఠాలు నేర్చుకున్నారని క్రెడాయ్ చెబుతోంది. కరోనా ద్వారా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు క్రెడాయ్‌ తెలిపింది.


అయితే ఒకవేళ కరోనా విజృంభించి మళ్లీ లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు పెట్టాల్సి వస్తే.. వాటి నుంచి స్థిరాస్తి, నిర్మాణ రంగాలకు మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ డిమాండ్ చేస్తోంది. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు క్రెడాయ్ చెబుతోంది. రియల్ ఎస్టేట్  కార్యాలయాలు, ప్రాజెక్టుల వద్ద కరోనా గైడ్ లైన్స్ పాటించాలని క్రెడాయ్ డెవలపర్లను కోరంది.

మరింత సమాచారం తెలుసుకోండి: