ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అవుతోంది. దానివల్ల చాలా మంది కంగారుపడిపోతున్నారు. అదేంటంటే..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వ్యక్తులకు జరిమానా తప్పదు. ఇప్పుడు ఈ విషయంపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ వార్త వైరల్ అవ్వడంతో చాలా మంది ఆందొోళన చెందుతున్నారు. అయితే ఇదొక ఫేక్ న్యూస్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది. పీఐబీ దీనిపై ఓ నోట్ ను కూడా రిలీజ్ చేసింది.
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాను ఉండటం వల్ల ఎటువంటి జరిమానా ఉండదని పిఐబీ స్పష్టం చేసింది. ఆర్బీఐ కూడా తమ రూల్స్‌లో ఇలాంటి దాని గురించి అస్సలు తెలియజేయలేదని తేల్చి చెప్పింది. ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏదైనా వార్త నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి ప్రజలు పీఐబీకి పంపి నిర్దారించుకోవచ్చు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సేవలకు వార్తల స్క్రీన్ షాట్ లేదా ట్వీట్, ఫేస్ బుక్ పోస్టులు లాంటివి పంపాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ నంబర్ 8799711259కి కూడా వార్తలను పంపి అవి నిజమైనవా? ఫేక్ వార్తలా అనేది తెలుసుకోవచ్చు. factcheck@pib.gov.in ఈ-మెయిల్‌కి వార్తలను పంపి నిజనిర్ధారణ చేసుకోవచ్చని పీఐబీ తెలిపింది. ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.