టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వరుస ఎంక్వైరీలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే  ముగ్గురు సినీ సెలబ్రిటీలను ఈడీ విచారించింది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలపై కూపీ లాగింది. నిందితులతో ఉన్న సంబంధాలపై ఆధారాలను ముందుంచి ప్రశ్నించింది. హైదరాబాద్‌లో సాగుతున్న సినీ తారల డ్రగ్స్ కేసు విచారణను  ఢిల్లీ ఈడీ మానిటరింగ్ చేస్తోంది. కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈనెల 6న విచారణకు హాజరు కావాల్సిన రకుల్ ప్రీత్ సింగ్.. వ్యక్తి గత కారణాలతో మూడు రోజుల ముందే ఈడీ ముందుకు వచ్చింది. ఇచ్చిన సమయానికి గంట ముందే ఈడీ కార్యాలయానికి చేరుకుంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో జరిగిన విచారణకు రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఆమె చార్టర్డ్ అకౌంటెంట్,  న్యాయవాది హాజరయ్యారు.. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది.  రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీలను  ఈడీ అధికారులు పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో కొన్ని డాక్యుమెంట్లను ఈడీకి రకుల్ అందించింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ లో ఉన్న మూడు బ్యాంక్ అకౌంట్లు, ఎఫ్ క్లబ్ మేనేజర్‌తో జరిపిన లావాదేవీలు.. హైదరాబాద్, విశాఖలో ఉన్న మూడు ఫిట్‌నెస్‌ సెంటర్ల ఆర్ధిక మూలాలపై  అధికారులు ప్రశ్నించారు. అన్ని ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానం సేకరించారు.

ప్రధానంగా  రకుల్ ప్రీత్ సింగ్‌ను మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ప్రశ్నించింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతంలో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారించింది. గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారణ నుంచి  తప్పించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణను ఎదుర్కోక తప్పలేదు. ఇక ఎఫ్ క్లబ్‌తో ఉన్న ఆర్ధిక లావాదేవీల వ్యవహారంపై ఈ నెల 13న విచారణ కు హాజరు కావాలని హీరో నవదీప్‌ను, ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు డ్రగ్ కేసుపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. డ్రగ్ అనేది ఒక్క సెలబ్రిటీ ఇష్యూ మాత్రమే కాదని చెప్పింది. రాజకీయ-సరిహద్దు-ఆర్థికపరమైన ఇష్యూ కూడా అంది. త్వరలో అన్ని విషయాలు మాట్లాడుతా అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: