యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా యూఏఈలోని తాలిబాన్ కార్యాలయానికి భారత్ ఆహ్వానం పంపడం వివాదస్పదంగా మారింది. అఫ్గానిస్తాన్ జర్నలిస్ట్ బిలాల్  సర్కారీ ఈ ఆహ్వాన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాలిబాన్, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు మధ్య అన్ని సంబంధాలు మెరుగయ్యాయి. ఇప్పుడు యూఏఈలోని భారత ఎంబీసీ, తాలిబాన్ రాయబారి హక్కానీ, ఆయన భార్యను ఆహ్వానించింది అని ఎక్స్ వేదికగా ప్రకటించారు.


మరోవైపు తాలిబాన్ రాయబారికి ఆహ్వానం వెళ్లినట్లుగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక ధ్రువీకరించింది.  2008లో కాబూల్ లోని భారత ఎంబీసీ మీద దాడి జరిగింది. ఈ దాడిలో తాలిబాన్ కీలక నేతలతో పాటు హక్కానీ నెట్ వర్క్ ప్రమేయం కూడా ఉంది. జర్నలిస్ట్ బిలాల్ షేర్ చేసిన ఆహ్వానం భారత రాయబారి సంజయ్ సుధీర్ పేరుతో ఉంది.


కాబూల్ లో తిరిగి తెరుచుకున్న భారత రాయబార కార్యాలయానికి టెక్నికల్ టీమ్ ను పంపించినప్పటి నుంచి మళ్లీ తాలిబాన్లతో చర్చలు జరుగుతున్నాయని సోర్సులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. తాజా ఆహ్వానం దీనిని ధ్రువపరిచేలా ఉంది. తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతూ, ఐరాస ప్రకారం అధికార గుర్తింపు ఇవ్వని ఇతర దేశాల మాదిరిగానే భారత వైఖరి ఉంది.


దీనిపై భారత్ స్పందిస్తూ భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని రొటీన్ లో భాగంగానే అందరికీ ఆహ్వానాన్ని పంపామని వివరించింది. అయితే ఇందులో పాకిస్థాన్ ను చేర్చలేదు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. కాగా భారత్ మిషన్లపై జరిపిన అనేక దాడుల్లో హక్కానీ నెట్ వర్క్ పాల్గొంది. 2008లో ఎంబీసీలో జరిపిన కారు దాడిలో 58మంది చనిపోయారు. ఇందులో ఇద్దరు భారత రాయబారులు, ఇద్దరు భారత భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయితే 2021 ఆగష్టు లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత  భారత్ తో సహా చాలా దేశాలు అఫ్గాన్ లోని తమ ఎంబీసీలను మూసేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: