రానున్న ఎన్నికల్లో ఎలాగైనా మంగళగిరి నుంచి గెలవాలని కంకణం కట్టుకున్న టీడీపీ కీలక నేత నారా లోకేశ్.. అవిరామంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతిరోజు బిజీబిజీగా ఉంటూ స్థానిక కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీ చీఫ్ అన్నామళైకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రతి నాయకుడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలంటే భయపడుతుంటారు. ఈ సమయంలో నారా లోకేశ్ తమిళనాడు వెళ్లి ప్రచారం చేయడం సాహసమనే చెప్పాలి. మరోవైపు లోకేశ్ కోయం బత్తూరు వెళ్లి ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏం ఉంటుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అక్కడ చిన్నబాబు ఏ మేర రాణిస్తారో చూడాలి.


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకున్నా ఆయన మంగళగిరి వదిలి రావడం లేదు. పార్టీలో నంబర్ 2  పొజిషిన్ లో ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మాత్రం చేయడం లేదు. ఇప్పటి వరకు నారా లోకేశ్ ఏపీలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందే లేదు.  దీనికి కారణాలు లేకపోలేదు. నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన పలు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించారు కూడా.


తీరా చూస్తే ప్రస్తుతం వారిలో కొంతమందికి టికెట్ దక్కలేదు. దీంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు.  మరోవైపు ఇప్పుడు ప్రకటించిన నేతల తరఫున ప్రచారం చేస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందనే అంచనాకు టీడీపీ అధినేత వచ్చినట్లున్నారు. గతంలో వారి అభ్యర్థిత్వాలు ఖరారు చేసి.. ఇప్పుడు మళ్లీ కొత్తవారి తరఫున క్యాంపెయిన్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది జనాల్లో నెగిటివ్ సంకేతాలను తీసుకు వెళ్తుంది.  ఇదిలా ఉండగా.. తెలంగాణలో టీడీపీకి క్యాడర్ ఉంది. మరి ఎన్డీయే తరఫున ఇక్కడ కూడా నారా లోకేశ్ ప్రచారం చేస్తారా అనేది చూడాలి. లేదంటే ఈయన అవసరం లేదు అని బీజేపీ భావిస్తుందా? అంటే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: