దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమరం జోరుగా సాగుతోంది. అర్థం కావడం లేదు కానీ.. ఎక్కడో ఏదో తేడా జరగుతుంది అన్నట్లు సాగుతుంది పోలింగ్. ప్రజలు బీజేపీని దూరం పెడుతున్నారా? పదేళ్ల మోదీ పాలనపై ప్రజలు విసుగు చెందారా? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. దశల వారీగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతల మాటలు మారుతూ వస్తున్నాయి. ఇవి మార్పునకు సంకేతమా అని పలు రకాల  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మోదీ మేనియా కనిపించడం లేదు అనేది వాస్తవం. గత రెండు ఎన్నికల్లో భారీగా కనిపించిన మోదీ ప్రభావం ఈ సారి ఎన్నికల్లో మచ్చుకైనా కనిపించడం లేదు అని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత మారిన స్వరానికి, నాలుగోదశ పోలింగ్ తర్వాత మారుతున్న స్వరానికి తేడాలు గమనించిన వారికి కారణాలు మాత్రం ఊహించడం కష్టంగా మారింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన లోక్ సభ స్థానాలు 163.


2019 ఎన్నికల్లో తాను సొంతంగా 303, కూటమి మిత్రులతో కలిసి 353 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి 370, 400 అన్న లక్ష్యాన్ని ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగింది. ఎదుటి పక్షాన్ని భయపెట్టాలనే వ్యూహంతో ఆ సంఖ్యను పదే పదే చెబుతూ తమకు ఈ ఎన్నికల్లో విజయం ఖాయమనే భావన కలిగించాలని ప్రయత్నించింది. తీరా చూస్తే ఆ 400 సీట్ల నినాదం ఇప్పుడు కనుమరుగు అయింది.


400 స్థానాలు అసాధ్యం అన్న అన్న మాటతో మొదలై.. క్రమంగా మెజార్టీ కే ఆమడ దూరంలో నిలిచిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు, షెఫాలజిస్టులు చెబుతున్నారు. బీజేపీ పరాజయ అవకాశాలను చర్చిస్తున్న యోగేంద్ర యాదవ్ దేశంలో మార్పు కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ తక్కువలో తక్కువ 100 స్థానాలు కోల్పోయినా 250పైగా స్థానాలతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయిన పలువరు అంచనా వేస్తున్నారు. మరి వంద పెరుగుతాయా.. లేక వంద తగ్గుతాయా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది. ఇంకా 163 స్థానాల్లో పోలింగ్ మిగిలి ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చని.. ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: