ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన అనేక హింసాత్మక ఘటనలు నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  మరోవైపు దీనికి కారణం మీరంటే మీరంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏపీలో పలు జిల్లాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.


ఇక మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. పోలింగ్ ముగిశాకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఫలితాల రోజు ఎలా ఉంటుందనే భయం అందరిలో మొదలైంది. ముఖ్యంగా నిఘా వర్గాల సమాచారం మేరకు రెండు నియోజకవర్గాల్లో హింస చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఒకటైతే.. మరొకటి కాకినాడ. అయితే పోలింగ్ నాడే గతంలో ఎన్నడూ చూడని హింసాత్మక ఘటనలు జరిగాయి. పలు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తలలు పగిలాయి. రక్తసిక్తం అయ్యాయి. ప్రధానంగా పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగింది.


మరోవైపు అనుమానిత నేతలు అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు.  అయితే ఇలా గొడవలు జరిగిన సమయంలో ఎక్కువగా బలయ్యేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలే. మనలో ఉన్న అవసరాన్ని గుర్తించి నాయకులు వారి అవసరాలకు మనల్ని ఉపయోగించుకుంటారు అనేది ఎప్పటికీ అర్థం అవుతుందో.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బైండోవర్లు, కార్డన్ సెర్చ్ లు వంటివి చోటు చేసుకుంటున్నాయి.


ఇందులో అన్యాయంగా బలయ్యేది ఎవరు అనేది ఒక్కసారి పరిశీలిస్తే.. ముఖ్య నాయకులు ఎవరూ ఉండరు. అంతా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కార్యకర్తలే. వీరిపైనే కేసులు నమోదు చేస్తారు. బైండోవర్ చేస్తారు. మరోవైపు ఆసుపత్రుల పాలైన వారిని గమనించిన సింహభాగం వీరే కనిపిస్తారు. రేపటి నుంచి ఏ చిన్న పండుగ జరిగినా.. ఉత్సవాలు జరిగినా శాంతి భద్రతల పేరిట ముందస్తుగా అరెస్టు చేసి జైలులో ఉంచుతారు. ఈ తలనొప్పి అంతా ఎందుకు. పార్టీపై అభిమానం ఉంటే ఓటేసే వరకే. ఆ తర్వాత ఘర్షణలు వల్ల ఇబ్బంది పడేది నీవు. నీ కుటుంబమే. ఇప్పటికీ అయినా ఆయా రాజకీయ పార్టీల నాయకుల ట్రాప్ లో పడి.. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: