ఏం చేస్తారు వేరే దారిలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ చానళ్ళ ఎండి వేమూరి రాధాకృష్ఖ ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పదనాన్ని అంగీకరించక తప్పలేదు. ప్రతి ఆదివారం  రాస్తున్న కొ(చె)త్త పలుకులో ఈసారి జగన్ గొప్పదనాన్ని అంగీకరించక తప్పలేదు.  ప్రతిసారి జగన్ పై బురద చల్లినట్లే ఈసారి కూడా చల్లినా మధ్యలో మాత్రం చంద్రబాబునాయడు, కేసీయార్ కన్నా జగనే గొప్పోడని అంగీకరించాడు. అంటే జగన్ గొప్పదనాన్ని నేరుగా తాను అంగీకరించలేదు లేండి. ఏపిలో జనాలు జగన్ పరిపాలన బాగుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. నిజానికి ఈ విషయం అంగీకరించటానికి, రాయటానికి వేమూరి ఎంతగా బాధపడిపోయుంటాడో. చంద్రబాబు, కేసీయార్ సిఎంలు అయిన విషయాన్ని వేమూరి ప్రస్తావించాడులేండి.

 

అప్పట్లో చంద్రబాబు, కేసీయార్ పరిపాలనపై ఏపిలో జనాలు కంపేర్ చేసుకునే వారట. ఆ కంపేరిజన్ లోనే చంద్రబాబుకన్నా కేసీయార్ బాగా పరిపాలిస్తున్నాడని ఏపిలో జనాలు చెప్పుకునే వారని గుర్తు చేశాడు. అయితే తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కేసీయార్ గెలవగా  మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదే అయ్యింది. ఈ ఏడాదిలోనే జగన్-కేసీయార్ పరిపాలను జనాలు కంపేర్ చేస్తు ఏపి సిఎం జగన్ పరిపాలనే బాగుందని తెలంగాణా జనాలు అనుకుంటున్నట్లు తెగ బాధిపడితో అంగీకరించాడు. జగన్ పాలన అద్భుతమని సొంత మీడియా సాక్షి చెప్పలేదు. చెప్పినా అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అయితే జగన్ పాలన బాగుందని ఇటు ఏపిలోనే కాకుండా అటు తెలంగాణాలో కూడా జనాలు అనుకుంటున్నారనే ఫీడ్ బ్యాక్ వచ్చిందంటే ఏమనర్ధం ?

 

ఒకవైపు అదే పనిగా జగన్ పాలనపై ఒకవైపు ఎల్లోమీడియా బురద చల్లుతున్న నేపధ్యంలో కూడా జనాలు జగన్ పాలనను మెచ్చకుంటున్నారన్నదే ఇక్కడ పాయింట్. జగన్ అమలు చేస్తున్న పథకాలన్నీ మాయామశ్చీంద్రను తలపిస్తున్నట్లు ఎల్లోమీడియా తన అక్కసంత వెళ్ళగక్కింది. నిజంగా పథకాల ప్రకటనలో జనాలను మాయ చేయొచ్చేమో కానీ అమలులో సాధ్యంకాదు.  ఎందుకంటే పథకాల అమలు ఒకసారి మొదలైన తర్వాత నిజంగానే మోసం జరుగుతుంటే జనాలు తెలుసుకోలేనంత అమాయకులు కారన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారం అందుకోవటానికి నోటికొచ్చిన ఆచరణ సాధ్యంకాని పథకాలను చంద్రబాబు ప్రకటించాడు. అధికారంలోకి రాగానే చాలావాటిని అటకెక్కించేశాడు. అయితే జగన్ ఆపని చేయకుండా ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలను అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చాడు.

 

ఇక్కడే చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన చాలా బాగుందని జనాలు అనుకోవటం మొదలుపెట్టారు. అదే సమయంలో తెలంగాణాలో కేసీయార్ కూడా పథకాలపేర్లతో జనాలను మాయ చేయటం మొదలుపెట్టాడు. ముందస్తు ఎన్నికల సమయంలో అమలైన పథకాల్లో కొన్ని ఇపుడు సరిగా అమలు కావటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దానికితోడు కరోనా వైరస్ ను ఎదుర్కొనే నేపధ్యంలో కేసీయార్ పలాయనవాదం కూడా జనాల్లో వ్యతిరేకత పెంచేస్తోంది. అదే సమయంలో ఏపిలో జగన్ ప్రభుత్వం వైరస్ ను ఎదుర్కోవటంలో వీలైనంతగా పోరాటం చేస్తోంది. ఇక్కడే జనాల్లో జగన్-కేసీయార్ పరిపాలపై కంపేరిజన్ పెరిగిపోతోంది.  

 

ఇక సంక్షేమపథకాల అమలులో కూడా జగన్ చాలా స్పీడుగా ఉన్నాడు. కాకపోతే జగన్ జోరుకు బ్రేకులు వేయటానికి చంద్రబాబు అండ్ కో కోర్టులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయాలన్న నిర్ణయం తప్ప జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పు పట్టాల్సినవి పెద్దగా లేవనే చెప్పాలి. అయినా ప్రతీ నిర్ణయాన్ని కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే విషయాన్ని జనాలు కూడా గ్రహించారు. అందుకనే చంద్రబాబు, కేసీయార్ పాలనకన్నా జగన్ పాలనే చాలా బాగుందని జనాలు అనుకోవటంలో తప్పేమీ లేదు. జనాలు అనుకోవటంలో వింతేమీ లేదుకానీ ఆ విషయాన్ని ఎల్లోమీడియా రాతల్లో అంగీకరించటమే ఆశ్చర్యం.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: