తెలుగు రాష్ట్రాల‌పై క‌క్ష గ‌ట్టిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోదీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన యూనియ‌న్ బ‌డ్జెట్‌లోనూ య‌ధావిధిగా మొండి చేయి చూప‌డాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒడుపుగా వినియోగించుకున్నారు. రాష్ట్రంలో త‌న‌ను రాజ‌కీయంగా ఇరుకున పెడుతున్న బీజేపీపై ఆయ‌న‌ ప‌దునైన‌ విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయారు. ప‌నిలో ప‌నిగా తెలంగాణ సెంటిమెంట్‌నూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ప్రెస్ మీట్‌లో మూడు భాష‌ల్లో మాట్లాడుతూ జాతీయ మీడియా ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల‌వారికి అర్థ‌మ‌య్యేలా మోదీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. తాను కొద్ది రోజుల్లోనే దేశంలోని ఇత‌ర ముఖ్య విప‌క్ష‌ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వుతానని కేంద్రం కుటిల పూరిత వైఖ‌రిని చూస్తూ ఊరుకోబోమ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌కూడ‌ద‌ని, ఒక‌వేళ గెలిస్తే బీజేపీ నేత‌ల అహంకారం మ‌రింత పెరుగుతుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నిక‌ల్లో గెలుపు బీజేపీకి ఎంత ప్రాణావ‌స‌ర‌మో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయ‌డం ద్వారా కేవ‌లం తెలంగాణ‌లో ఆ పార్టీని నిలువ‌రించేందుకే ప‌రిమితం కాకుండా కేంద్ర రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పేందుకు మ‌రోసారి త‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టనున్న‌ట్టుగా స్ప‌ష్టం చేసిన‌ట్టేన‌నుకోవాలి.
 
           బీజేపీ ప్ర‌వ‌చిత గుజ‌రాత్ మోడ‌ల్ అంతా పైన ప‌టారం లోన లొటార‌మేన‌ని, సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను మోసగిస్తున్నారని కేసీఆర్ ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. మ‌త‌ప‌రంగా ప్ర‌జ‌ల‌ను విభ‌జించి క్షుద్ర రాజ‌కీయంతో బీజేపీ దేశాన్ని ఏలాల‌నుకుంటోంద‌ని కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. దేశంలో వివిధ వ‌ర్గాల మ‌ధ్య ఉన్న సామ‌ర‌స్య వైఖ‌రిని నాశ‌నం చేయ‌డం ద్వారా ఆప్ఘ‌నిస్తాన్‌లా త‌యారు చేయాల‌నుకుంటున్నారా అంటూ మోదీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. అస‌లు మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఈ దేశానికి ఏం ఒర‌గ‌బెట్టిందో చెప్పాల‌ని ఆయ‌న‌ సూటిగా ప్ర‌శ్నించారు. తాము అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అమ‌లు చేసే సాహ‌సం చేయ‌గ‌ల‌రా అంటూ కేసీఆర్ బీజేపీ నాయ‌క‌త్వాన్ని స‌వాల్ చేశారు. బీజేపీ ద‌ళిత ద్రోహి అని, కేంద్రంలో ఉన్న‌ది పేద‌ల వ్య‌డ‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని విమ‌ర్శించారు. ఆహార‌ స‌బ్సిడీని భారీగా త‌గ్గించ‌డాన్ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. హైద‌రాబాద్‌లో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో విస్తృత స్థాయి స‌మావేశాన్ని త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్నామ‌ని దేశ రాజ‌కీయ, ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌ల్లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ఏం చేయాల‌నేది ఆ స‌మావేశంలో చ‌ర్చిస్తామ‌న్నారు. దేశానికి కొత్త అజెండా కావాల‌ని, ఈ దేశ యువ‌త త‌మ భ‌విష్య‌త్తు కోసం పోరాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ప్ర‌భుత్వంపై కేసీఆర్ ఈ స్థాయిలో విరుచుకుప‌డటం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. కేంద్ర రాజ‌కీయాలను ప్ర‌భావితం చేయ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. బీజేపీకి వ్య‌తిరేకంగా తన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఎలా ఉండ‌బోతున్న‌దో వ‌చ్చే కొద్ది రోజుల్లో ఆయ‌న స్ప‌ష్టం చేసే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: