అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వీఆర్ పురం మండలంలోని వివిధ గ్రామాల్లో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వంపై  మండిపడ్డారు. అసమర్ధ ప్రభుత్వం పై పోరాడేందుకు వరద బాధితుల సిద్ధంగా ఉంటే నాయకత్వం అందించేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక నా దగ్గర ఉందన్న చంద్రబాబు.. కలిసి పోరాడదాం రండి అంటూ పిలుపు ఇచ్చారు.


వరద బాధితులకు 29రకాల నిత్యావసరాలు ఇవ్వాలని హుద్ హుద్ సమయంలో ఇచ్చిన జీవో స్పష్టం చేస్తుంటే సీఎం ఇచ్చింది 4ఉల్లిపాయలు, 4కుళ్ళిన టమోటాలు, 4 ఆలుగడ్డలా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నేను పెట్టే నిర్దిష్టమైన డిమాండ్లు అంగీకరించి వరద బాధితుల్ని ఆదుకోవాలన్న చంద్రబాబు.. బటన్ లు నొక్కే ముఖ్యమంత్రి ముందు పోలవరం పరిహారం బటన్ నొక్కాలని సూచించారు. దెబ్బతిన్న ప్రాంతాలు ఫోటోలు తీసి పెట్టాలని.. వాటితో ప్రభుత్వాన్ని నిలతీద్దామని పిలుపు ఇచ్చారు.


పోలవరం ముంపు ప్రాంతాల్ని స్తంభింపచేసే కార్యక్రమానికి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తానన్న చంద్రబాబు.. పోరాటానికి నిర్వాసితులంతా ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులో రూ.1.75లక్షల కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితులకు రూ.22వేల కోట్లు ఇవ్వలేడా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం పూర్తిచేయటం చేతకాకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసారు.


జగన్.. తనకు చేత కాదని దిగిపోతే.. పోలవరం నేను పూర్తి చేసి చూపిస్తానంటూ చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎగ్గొట్టేందుకు సీఎం కొత్త బాంబులు వేస్తున్నాడని.. కాంటూర్ లెవల్ పై కుట్రలు ఇందులో భాగమేనని చంద్రబాబు ఆరోపించారు. పనిలో పనిగా తెలంగాణలోని వరద బాధిత ప్రాంతాలనూ సందర్శించిన చంద్రబాబు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీ ఖిల్లా అంటూ గుర్తు చేసుకున్నారు. త్వరలోనే ఖమ్మంలో టీడీపీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: