తాళ పత్ర గ్రంధాలు.. మన పూర్వీకులు ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన గ్రంధాలు.. కానీ ఇవి కాలక్రమంలో పాడవుతున్నాయి. వీటిలోని అపార జ్ఞాన సంపద వృథా అవుతోంది.  భారత దేశంలో సాహిత్య, ఆధ్యాత్మిక, వైద్య, సంగీత, జ్యోతిష, శిల్పకళ వంటి అనేక ప్రాచీన కళలకు సంబంధించిన అమూల్య సమాచారం తాళ పత్ర గ్రంధాల్లో నిక్షిప్తం అయింది. తాటి ఆకులపై రాయడంతో వీటిని ఇంకా భద్రపరచడం కష్టమవుతోంది.


తాటి ఆకులు చెదలు పట్టడం, చిరిగిపోవడం కారణంగా అక్షరాలు కనిపించకపోవడం జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకూ ఈ సమాచారాన్ని భద్రపరిచేందుకు తాళ పత్ర గ్రంధాలనును స్కాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ స్కాన్‌ పత్రాలను కంప్యూటరీకరిస్తున్నారు. అయితే ఇలా చేసినా కూడా చాలా అక్షరాలు అర్థం కాని పరిస్థితి ఉంటోంది. అయితే.. ఇకపై ఇలా తాళ పత్ర గ్రంధాల్లోని సమాచారాన్ని స్కానింగ్‌ అవసరం లేకుండానే కాపాడవచ్చు. ఇందుకు 3డీ నమూనాలో నిక్షిప్తం చేసే సరికొత్త సాంకేతికతను సీబీఐటీ ప్రొఫెసర్ ఒకరు ఆవిష్కరించారు.


తాళ పత్ర గ్రంథాల రక్షణ కోసం కొత్త సాంకేతికతను కనిపెట్టేందుకు సీబీఐటీ ఆచార్యుడు పి.నరహరిశాస్త్రి తీవ్రంగా శ్రమించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈయనకు ఈ ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని కోసం 7.31లక్షల గ్రాంటు ఇచ్చి ప్రోత్సహించింది. అందుకు తగ్గట్టుగానే నరహరి శాస్త్రి.. టెఫ్లాన్‌ ఆధారిత సూది సాయంతో తాళపత్రాలపై ఉన్న సమాచారాన్ని స్కాన్‌ చేసి 3డీ ఫార్మాట్‌లో కంప్యూటరైజ్ చేసేలా కొత్త టెక్నాలజీని తయారు చేశారు.


టెక్నాలజీ వల్ల ప్రత్యేకంగా తాళ పత్రాలను స్కానింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. పత్రాలపై సమాచారాన్ని కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ సాయంతో 90శాతం కచ్చితత్వంతో కంప్యూటరైజ్‌ చేయొచ్చు. పాడైన తాళపత్రాలను సైతం పునర్నిర్మించే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ రూపకల్పనలో ప్రొఫెసర్ ఎన్‌వీ కోటేశ్వరరావు, ఇస్రో శాస్త్రవేత్త రామకృష్ణ కృష్ణన్‌ కూడా  సహకారం అందించారు. ఈ టెక్నాలజీకి గత నెలలో పేటెంట్‌ కూడా మంజూరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: