దిల్లీ మద్యం కుంభ కోణం వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతోంది. ఈ కుంభకోణంతో సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టే హైదరాబాద్‌లోని పలు చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. ఈ స్కామ్‌లో పేర్లు బయటకు వచ్చిన.. అభిషేక్‌రావు, రామచంద్రన్‌ పిళ్లైతో కలిసి కవిత తిరుపతి  ఏడు కొండల వెంకన్న గుడి దగ్గర తీయించుకున్న ఫోటో ఇప్పుడు కలకలం రేపుతోంది.


ఓ ఇంగ్లీష్ పత్రికలో ఈ ఫోటోతో పాటు కథనం వచ్చింది. దీన్ని పట్టుకుని ఇప్పుడు బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు.  ఈ ఫోటోపై ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. అభిషేక్‌రావు, రామచంద్రన్‌పిళ్లైతో పాటు సృజన్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని గతంలో కవిత చెప్పిన విషయాన్ని రఘునందన్‌ రావు గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వెళ్లిన ఆమె వారితో కలిసి సకుటుంబ సపరివారంగా ఫొటో దిగారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఈ ఫోటోను చూపిస్తూ రఘునందన్‌ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈడీ హైదరాబాద్‌లో ఏడుచోట్ల తనిఖీలు చేస్తే బయటపడ్డ కంపెనీలు, డాక్యుమెంట్లు బయటకు వచ్చాయని..  వారు చేస్తున్న ప్రాజెక్టులు, వారికి, వీరికి సంబంధం ఉన్న ఫొటోలు బయటకొచ్చాయని రఘునందన్ రావు తెలిపారు. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త, ఫొటోనే తాను చూపిస్తున్నానని.. ఇది తాను తయారు చేసింది కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అంటున్నారు. సృజన్‌ రెడ్డితో కలిసి కవిత ఓ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని ఆ పత్రికలో రాసిన విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు చదివి వినిపించారు.


ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. మద్యం కుంభకోణంలో మీ బావమరిది పేరు ఉందని విలేకరులు అడిగితే తనకు అలాంటి బంధువులు లేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారని.. కానీ.. మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ద్వారా ఆయనకు బంధువు అని తమ పరిశీలనలో తేలిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. కవిత, రేవంత్ రెడ్డి బంధుత్వాల విషయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని రఘునందన్‌ రావు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: