
లోకేష్ పాదయాత్ర టీడీపీకి ఒక బూస్టు లాంటిదే.. ఇందులో ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవడంలో నారా లోకేష్ ముందుండాలి.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పాదయాత్రలో లోకేష్ అన్నారు. అది ఎక్కడి నుంచి ఇస్తారు. ఎందులోంచి ఇస్తారు. గతంలో ఒకసారి ఇలానే ప్రయత్నించారు. దాన్ని కోర్టులో సవాలు చేయడంతో దాన్ని కొట్టివేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెట్టడానికి అవకాశం లేదు.
ఇలాగే గతంలో మాదిగలకు వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. అది కుదరదని తెలిసినా అసెంబ్లీలో మాట్లాడటం, దాన్ని రాజకీయంగా వాడుకోవడం తర్వాత అది కుదరదని తేలడం ఇలాంటివి టీడీపీ హయాంలో జరిగినవే. అయినా మళ్లీ లోకేష్ ఇలాంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకుంటాడా అది సాధ్యమేనా చూడాలి. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేశామని అన్నారు. కానీ దాన్ని కోర్టు కొట్టేసింది. తర్వాత అది వివిధ రాజకీయ పార్టీల కుట్రగా భావించారు. ఈబీసీల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కానీ అది కుదరడం లేదు.
ఇప్పుడు ఉన్నది బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడం, కానీ ఎలా పెంచుతారు. ఎక్కడ సాధ్యమవుతుంది అనేది స్పష్టత ఇస్తేనే బీసీలకు నమ్మకం కలుగుతుంది. పాదయాత్రలో చెప్పిన విషయాలు అన్ని నిజమవుతాయని కాదు. జగన్ తగ్గించాడు. మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు. ఇలాంటివి కాకుండా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లతో బీసీలకు ఎక్కవ ఇస్తామంటే కనీసం నమ్మకం అయినా వస్తుంది.