ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోని 2019 లో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించారు. దీంతో భగ్గుమన్న అమరావతి రైతులు ఆందోళనలు, దీక్షలు మొదలుపెట్టారు. తమకి అన్యాయం చేయొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రతిపక్షాలు సైతం వీరికి అండగా నిలిచాయి. అయితే ఇవేమీ పట్టించుకోని సీఎం జగన్ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తారు. ఈ మేరకు అందరు సెక్రటరీలకు సమాచారం అందింది. అన్ని విభాగాల అధిపతులూ సెప్టెంబర్ 20 కన్నా ముందుగానే విశాఖపట్నం తరలి వెళ్లాలని ఆదేశాలు అందాయి. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులు ఈలోపునే తొలగిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు సంబంధించి కౌన్సిల్ లో కూడా ప్రవేశ పెట్టారు. దానికి సంబంధించిన గడువు కూడా పూర్తి కావడంతో ఆటోమేటిక్ గా బిల్లు ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. తదుపరి రాష్ట్ర గవర్నర్ సంతకం చేస్తే అది చట్టంగా మారిపోతుంది. అందుకోసమే సెప్టెంబర్ 20ని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
రాజధాని తరలింపు విషయంలో కృతనిశ్చయంతో ఉన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 20న విశాఖపట్నం నుంచి తొలి జీవో విడుదల చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. పైగా అక్టోబర్ 25 న విజయదశమి కావడంతో.. అప్పటిలోపే పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారట. మరి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని తేల్చి చెప్తున్న బీజేపీ నాయకులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఇలాంటి ముహూర్తాలు ఎన్నో తెరపైకి వచ్చాయి. కానీ, అవేమీ నిజం కాలేదు. మరి తాజాగా తెరపైకి వచ్చిన ఈ ముహూర్తం ఐనా నిజం అవుతుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి