కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళలో విచిత్రమైన ప్రవృత్తి మొదలైనట్లే ఉంది. తమకు వైరస్ పాజిటివ్ ఉందని తెలిసో, తెలియకో పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కొందరు జనాల్లో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి జనాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. దేశం, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్ధితిని పక్కనపెట్టినా తిరుపతిలో కొన్ని ఉదాహరణలు బయటపడుతున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా మొత్తం సుమారు 6 వేల పాజిటివ్ కేసులు నమోదైతే ఒక్క తిరుపతిలో మాత్రమే సగం కేసులు రిజస్టర్ అయ్యాయి. థ్యాంక్స్ టు తిరుమల అనే చెప్పాలి. జూలై 11వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభమయ్యేనాటికి తిరుపతిలో కరోనా కేసులు పెద్దగా లేవనే చెప్పాలి.

 

ఎప్పుడైతే తిరుమలలో స్వామివారి దర్శనాలు మొదలయ్యాయో తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు వచ్చే వాళ్ళు దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగేస్తుండటంతో వైరస్ వ్యాప్తి చాలా స్పీడుగా పెరిగిపోతోంది. అలిపిరి దగ్గర వైరస్ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతుండటం అంతంత మాత్రంగానే ఉండటంతో వైరస్ బాధితులు యధేచ్చగా తిరుమలకు వెళిపోతున్నారు.  తిరుపతిలో పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తి కారణంగా అధికారులు జనాలందరికీ టెస్టులు చేయించాలని డిసైడ్  చేశారు. ఇక్కడే సమస్య వస్తోంది.

 

ఇంతకీ అధికారులకు ఎదురవుతున్న సమస్య ఏమిటంటే కరోనా వైరస్ స్వాబ్ టెస్టు చేయించుకున్న జనాల అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు అధికారులకు సరిగా అందటం లేదు. పరీక్షలు చేయించుకుంటున్న బాధితులు తమ పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్ లు ఇచ్చేసమయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టెస్టుల రిజల్ట్సు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా సదరు  ఫలితాలను చెప్పటానికి ఫోన్ చేస్తుంటే అవన్నీ తప్పుడు నెంబర్లుగా తెలుస్తోంది.  ఒకటి ఫోన్ స్విచ్చాఫ్ లేదా ఆ నెంబర్ తో ఎవరూ లేరని సమాధానం వస్తోందట. పోనీ అడ్రస్సులు ఇచ్చారు కదాని అక్కడి వెళితే ఆ అడ్రస్ లో కొత్తవాళ్ళు కనిపిస్తున్నారట. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక అధికారులు, వైద్య సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

 

గడచిన పదిరోజుల్లో తిరుపతి మొత్తం ఇటువంటి పాజిటివ్ కేసులు సుమారు 240 బయటపడ్డాయట.  అంటే వీళ్ళంతా కరోనా వైరస్ క్యారియర్లని అర్ధమైపోతోంది. వీళ్ళకు కరోనా వైరస్ ఉండటం వల్ల కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులే కాకుండా వీళ్ళు తిరిగిన ప్రాంతాల్లో ఇంకెంతమందితో కాంటాక్టులోకి వెళుతున్నారో ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు. ఈ 240 పాజిటివ్ కేసుల విషయాన్ని ప్రత్యేకంగా అధికారులు పోలీసులతో చర్చించినట్లు సమాచారం. మరి తప్పుడు అడ్రస్సులు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చిన వాళ్ళ విషయంలో పోలీసులు మాత్రం చేయగలిగేదేముంటుందో ఎవరికీ అర్ధంకావటం లేదు. కొంతమంది ఇస్తున్న  తప్పుడు ఫోన్ నెంబర్ల ఆధారంగానే టెస్టులు చేయించిన తర్వాత అధికారులు  ఫోన్ చేస్తే ఇంకెవరికో వెళ్ళి వాళ్ళతో గొడవలవుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: