విశాఖపట్నంలోని గీతం కాలేజీ పంచాయితి కీలక మలుపు తిరుగుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.  భూకబ్జా వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలాగ మారి చివరకు కాలేజీ గుర్తింపు రద్దు అయ్యే ప్రమాదంలో పడేట్లుంది. గీతం కాలేజీ ఎప్పుడో ప్రారంభం అయినా మెడికల్ కాలేజీ మాత్రం 2015లోనే ప్రారంభమైంది. ఇపుడు దానికి సంబంధించిన వివాదామే పెద్దదైపోతోంది. నిజానికి ప్రభుత్వంకు చెందిన 40 ఎకరాల భూమి గీతం యాజమాన్యం సంవత్సరాల క్రితమే కబ్జా చేసిందన్న మాట వాస్తవం.  గీతం చేసిన కబ్జా వ్యవహారం జిల్లాలోని అన్నీ రాజకీయ పార్టీల నేతలకు బాగా తెలుసు. సంవత్సరాల తరబడి తమ ఆధీనంలోనే ఉన్న భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న యాజమాన్యం ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆ కారణంగానే భూమిపై శాశ్వత హక్కులు పొందలేక చివరకు వేరే దారిలేక కబ్జాతోనే కంటిన్యు అవుతోంది యాజమాన్యం. చివరకు యాజమాన్యానికి చంద్రబాబునాయుడు దగ్గర బంధువయ్యుండి కూడా సదరు భూమిని వాళ్ళకు సొంతం చేయలేకపోయాడు.




ఈ నేపధ్యంలోనే తాము కబ్జా చేసిన భూమిలో యాజమాన్యం పక్కా భవనాలను కూడా కట్టేసుకుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందాలు తనిఖీకి వచ్చినపుడు, ఇతరత్రా బృందాల పర్యటనలో కూడా కబ్జా చేసిన భూమిని యాజమాన్యం తన సొంతంగానే చూపించుకుంది. అందుకు అవసరమైన ఒప్పందాలను కూడా చూపించుకుందట. అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ మారిపోవటంతో కబ్జా విషయంలో ప్రభుత్వం యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయిపోయింది. నాలుగు రోజుల క్రితం రెవిన్యు అధికారులు హఠాత్తుగా యూనివర్సిటికి చెందిన కాంపౌండ్ వాలుతో పాటు ముఖద్వారాన్ని కూడా కూల్చేసింది. దాంతో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు+ఎల్లోమీడియా నానా గోల మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి సీన్ లోకి ఎంటర్ అయ్యారు.




గీతం మెడికల్ కాలేజీ  గుర్తింపును రద్దు చేయాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాయటం దుమారం రేపుతోంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిని తమది చెప్పుకుని, తప్పుడు పత్రాలు చూపించుకుని కౌన్సిల్ నుండి అనుమతి తెచ్చుకున్నారంటూ ఎంపి తన ఫిర్యాదులో చెప్పారు.  ప్రభుత్వ భూమిని ఆక్రమించటమే కాకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, కాలేజీ భవనాలు, ల్యాబరేటరీలు, లైబ్రరీ లాంటివి కట్టేసినట్లు ఆరోపించారు. అంటే ఎంపి చేసిన ఫిర్యాదు ప్రకారం చూస్తే  నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణాలు చేయటమే కాకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ను కూడా గీతం యాజమాన్యం మోసం చేసినట్లు అర్ధమవుతోంది. 2015లో ప్రారంభమైన కాలేజీని తర్వాత కౌన్సిల్ సందర్శించిందట. తమ పరిశీలనలో కాలేజీలో తగినంత స్టాఫ్ లేదన్న కారణంతో 2017-18 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు రద్దు చేసిందని ఎంపి గుర్తుచేశారు.




అయితే వెంటనే పర్మినెంట్ స్టాఫ్ ను నియమించుకుంటామనే హామీని ఇచ్చి విద్యార్ధులను చేర్చుకున్న యాజమాన్యం తర్వాత హామీని తుంగలో తొక్కిందట. గీతంలో పనిచేసే మెడికల్ స్టాఫ్ అంతా తాత్కాలిక లెక్షిరర్లు మాత్రమే అంటూ ఎంపి స్పష్టంగా చెప్పారు. ఏ విధంగా చూసినా కాలేజీ ప్రారంభం నుండి ప్రతి దశలోను యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతున్న కారణంగా వెంటనే మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎంపి డిమాండ్ చేశారు. అలాగే కాలేజీ యాజమాన్యం పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటూ విజయసాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయటం సంచలనమైంది. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి, కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేశారు కాబట్టి కౌన్సిల్ కూడా ఫిర్యాదు పై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరి చివరకు ఈ కబ్జా వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: