ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో యువ‌త అత్యంత ఎక్కువ‌గా ఉన్న పెద్ద దేశం భార‌త్‌. తాజా అంచ‌నాల ప్ర‌కారం 35 ఏళ్ల లోపు వారి సంఖ్య మొత్తం జ‌నాభాలో 65 శాతం కంటే కాస్త ఎక్కువే. ఈ యువ‌శ‌క్తిని స‌మ‌ర్థంగా ఉత్పాద‌క వ‌న‌రుగా మార్చుకోగ‌లిగితే దేశాభివృద్ధిని ప‌రుగులు పెట్టించ‌వ‌చ్చు. ఇదే స‌మ‌యంలో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా, సాంకేతిక‌త‌కు పుట్టినిల్లుగా పేరొందిన జ‌పాన్‌, ఉత్ప‌త్తి రంగానికి కేంద్రంగా ఎదిగిన చైనాల్లో వృద్ధుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. అమెరికా, జ‌పాన్‌ల‌లో ఈ ప‌రిస్థితికి సామాజిక అంశాలు, మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు కార‌ణాలైతే.. చైనాలో మాత్రం ఇటీవ‌లి కాలం వ‌ర‌కూ అక్క‌డి ప్ర‌భుత్వం అనుస‌రించిన క‌ఠిన‌మైన కుటుంబ నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇందుకు దారి తీశాయ‌ని చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ యువ‌త అవ‌కాశాలు వెదుక్కుంటూ ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డుతున్నారు. సాంకేతిక విప్ల‌వంలో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వాలు సైతం భార‌తీయుల ప్ర‌తిభ‌కు పెద్ద పీట వేస్తున్నాయి. ప‌లు గ్లోబ‌ల్ కంపెనీల‌కు సీఈవోలుగా భార‌తీయులు అద్భుతాలు సృష్టిస్తూ త‌మ స‌త్తా చాటుకుంటున్నారు.

ఇదంతా నాణానికి ఒక‌వైపు. మరోవైపు మెరుగైన ఉపాధి అవ‌కాశాలే ల‌క్ష్యంగా చురుకైన స‌మ‌ర్థులైన యువ‌త‌రం దేశాన్ని వీడుతుంటే దేశం రాజ‌కీయంగా నాయ‌క‌త్వ కొర‌త‌ను ఎదుర్కొంటుందేమోన‌న్న సందేహాలను సామాజిక నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో ఎక్క‌డో కొద్దిమంది నాయ‌కుల వార‌సులు త‌ప్ప‌ యువ‌త రాజ‌కీయాల‌వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. కీల‌క‌మైన రాజ‌కీయ‌రంగంలో యువ‌త‌రం పాత్ర నానాటికీ తీసిక‌ట్టుగా మారుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. రాజ‌కీయాల‌పై నేటి యువ‌త‌కు ఏమాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌డం, పైగా వాటిపై అంత‌కంత‌కూ ఏహ్య‌భావం పెంచుకోవ‌డం, దేశ వ‌ర్త‌మాన ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణాలుగా చెప్పాలి. దేశానికి స్వాతంత్యం వ‌చ్చి నాటితో పోలిస్తే రాజ‌కీయ నాయ‌కుల స‌గ‌టు వ‌య‌సు ఇప్పుడు గ‌ణ‌నీయంగా పెరిగింది.

దేశంలోని ప‌లు రాష్ట్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 2024 ఎన్నిక‌ల నాటికి ప్ర‌భావం చూప‌గ‌ల నేత‌ల జాబితాను ప‌రిశీలిస్తే పైన పేర్కొన్న అంశంలోని వాస్త‌వాలు క‌ళ్ల‌ముందు క‌న‌బ‌డ‌తాయి. వీటిలో ముందుగా ఏపీ విష‌యానికొస్తే టీడీపీ అధినేత చంద్ర‌బాబు 72 వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉంటారు. త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ వ‌య‌సు అప్ప‌టికి 70 ఏళ్లు దాటుతుంది. ఇక ర‌జ‌నీకాంత్ కు 73, క‌మ‌ల్‌హాస‌న్‌కు 70 ఏళ్లు నిండుతాయి. క‌ర్నాట‌క విష‌యానికొస్తే సీఎం య‌డ్యూర‌ప్ప‌కు 80 ఏళ్లు దాటుతాయి. విప‌క్ష నేత‌లు సిద్ధ‌రామ‌య్య‌ 75 ఏళ్లు, కుమార‌స్వామి 63 ఏళ్ల వ‌య‌సుతో పోటీ ప‌డ‌తారు.  పిన‌ర‌య్ విజ‌య‌న్ 79, ఊమ‌న్ చాందీ 80 కేర‌ళ‌లోనూ, కేసీఆర్ 69, జానారెడ్డి 78 తెలంగాణ‌లో,  న‌వీన్ ప‌ట్నాయ‌క్ 78, నిరంజ‌న్ ప‌ట్నాయ‌క్ 75 ఒడిషాలో, అశోక్‌గెహ్లాట్ 72, వ‌సుంధ‌రారాజె 70 రాజ‌స్థాన్‌లో పోటీలో నిలుస్తారు. శ‌ర‌ద్‌ప‌వార్ 82 మ‌హారాష్ట్ర‌లో, అమ‌రీంద‌ర్‌సింగ్ 81 పంజాబ్‌లో, వీర‌భ‌ద్ర‌సింగ్ 90 హిమాచ‌ల్‌లో ప్ర‌త్య‌ర్థుల‌తో త‌ల‌ప‌డుతారు. ఇక మ‌మ‌తాబెన‌ర్జీ 69 బెంగాల్‌లో, మాయావ‌తి 67 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త‌మ ప్ర‌భావం కొన‌సాగిస్తారు. అలాగే, ప్ర‌ధాని మోదీ 73 ఏళ్ల వ‌య‌సులో ఢిల్లీ సింహాస‌నం కోసం మ‌రోసారి పోటీ ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో స‌మీప భ‌విష్యత్తులోనూ కురువృద్ధుల‌న‌ద‌గ్గ నేత‌లే దేశ‌రాజ‌కీయాల‌పై త‌మ హ‌వా కొన‌సాగించ‌నుండ‌గా.. ఆ స్థాయి ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న యువ‌నేత‌లు వేళ్ల‌మీద లెక్కించ‌ద‌గిన సంఖ్య‌లోనే ఉన్నార‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: