కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే వాదనలకు ఈ అమెరికా నివేదక బలం చేకూరుస్తోంది. చైనా పరిశోధన కేంద్రం నుంచే మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైక్ మెక్‌కాల్ అంటున్నారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ మానవులకు సోకేలా జన్యుపరమైన మార్పులు చేశారని రిపబ్లికన్లు చెబుతున్నారు. చైనా ఆ సంగతి దాచి పెట్టిందని చెబుతున్నారు. తమ వాదనలకు తగిన సాక్ష్యాలు ఉన్నాయంటన్నారు రిపబ్లికన్లు.
చైనాలోని వుహాన్ ల్యాబ్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు లేవని.. ప్రమాదకర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ‌్యవస్థ కూడా సరిగా లేదని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. చైనా చేసిన ఈ నిర్లక్ష్యపు పని కారణంగా కరోనా పుట్టి రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ రిపబ్లికన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఈ కరోనా వైరస్ సీ ఫుడ్ మార్కెట్ ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా చెబుతున్న వింత వాదనను కూడా ఈ రిపబ్లికన్ల నివేదిక పూర్తిగా తప్పుబట్టింది.
కరోనా ముమ్మాటికీ వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని రిపబ్లికన్ల రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. 2019 సెప్టెంబర్ 12కు ముందే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి