ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి 20 రోజులు దాటిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందన్న సంగతి ముందే అమెరికాకు తెలుసు. అందుకే ఆ దేశం ఈ యుద్ధం గురించి ముందే ప్రపంచాన్ని హెచ్చరించింది. ప్రపంచం అంతా టాం టాం చేసింది. ఇదిగో రష్యా దాడి చేస్తోంది..అదిగో దాడి చేస్తోంది..అంటూ ముందుగానే అలర్ట్ చేసింది. అయినా సరే.. రష్యా ఉక్రెయిన్‌ పై యుద్ధం చేయాలన్న నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. కొన్ని రోజులు వాయిదా వేసుకుని.. ఆ తర్వాత యుద్ధం ప్రారంభించాడు.


మొత్తానికి రష్యా యుద్ధంలోకి దిగడంతో అంతా భయపడ్డారు. రష్యా సైనిక శక్తి ముందు ఉక్రెయిన్ తలవంచక తప్పదని భావించారు. యుద్ధం నాలుగైదు రోజుల్లో ముగిసిపోతుందని.. ఉక్రెయిన్ కు లొంగిపోవడం మినహా వేరే మార్గం లేదని భావించారు. రష్యా షరతులు ఏంటో తెలుసుకుని..వాటికి ఓకే చెప్పడం తప్ప వేరే మార్గం లేదని ప్రపంచ దేశాలు భావించాయి. అనుకున్నట్టుగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా వంటి దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగలేదు.


ఇంకేముందు.. ఉక్రెయిన్ లొంగిపోవడం ఖాయం అనుకుంటుండగానే.. ఉక్రెయిన్‌ మాత్రం గట్టిగానే రష్యాతో పోరాడుతోంది. క్రమంగా నాటో దేశాలు అందిస్తున్న ఆయుధాలతో రష్యా సైనికులను నిలువరిస్తోంది. అయితే రష్యా వంటి బలమైన దేశానికి ఉక్రెయిన్ వంటి దేశాన్ని ఆక్రమించడానికి లేదా .. అదుపులోకి తెచ్చుకోవడానికి ఇంత సమయం ఎందుకు పడుతోందన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న.


వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ను నిజంగా పూర్తి స్థాయి సైనిక చర్యతో ఓడించాలని నిజంగా భావిస్తే.. అది పెద్ద పనేమీ కాదు.. కానీ.. ఈ ప్రపంచంలో రష్యా పెద్ద విలన్‌ గా అవతరిస్తుంది. రష్యా ఇమేజ్‌ చెడిపోతోంది. అందుకే రష్యా పరిమిత యుద్ధానికే మొగ్గు చూపుతోంది. తనకు మరీ అంత బ్యాడ్ నేమ్ రాకుండా ఉక్రెయిన్ ను తన దారికి తెచ్చుకోవడమే రష్యా ఉద్దేశ్యం. అందుకే ఈ యుద్ధం జీడిపాకం సీరియల్‌ తరహాలో కొనసాగుతోంది. ఇలాగే కొన్ని రోజులపాటు రష్యా గెలవకుండా.. ఉక్రెయిన్ ఓడకుండా యుద్ధం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: