ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అనేక యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. రష్యా వైఖరిని తీవ్రంగా ఖండించాయి. అంతే కాదు.. రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే వీటిని తట్టుకుని రష్యా నిలబడింది. అయితే.. రష్యా విధిస్తున్న అప్రకటిత ఆంక్షలతో ఇప్పుడు యూరప్ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. యూరప్ దేశాలు విధించిన ఆంక్షలకు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.


ఇప్పటికే యూరప్ దేశాలకు వెళ్తున్న గ్యాస్‌ను నిర్వహణ పేరుతో కొంతమేర పుతిన్ అడ్డుకుంటున్నారు. ఇప్పుడు యూరప్ దేశాలపై పుతిన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించారు. దీంతో శీతాకాలంలో గ్యాస్‌ను ఎక్కువగా వినియోగించే యూరప్ దేశాలు పుతిన్ నిర్ణయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. రష్యాకు చెందిన గాజోప్రామ్‌ సంస్థ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాదారు.  వార్షిక నిర్వహణ కోసం 10 రోజులు నిలిపివేసిన పైపులైన్‌ను గతవారం రష్యా ప్రారంభించినా.. 40శాతం మాత్రమే సరఫరా చేస్తోంది. వారం రోజుల తర్వాత దాన్ని ఏకంగా 20 శాతానికి తగ్గించింది.


అదేమంటే.. పరికరాల మరమ్మతు కారణంగా గ్యాస్‌ సరఫరా తగ్గించినట్లు గాజోప్రామ్‌ సంస్థ చెబుతోంది.. ఈ నార్డ్‌ స్ట్రీమ్‌-1 పైపులైను పూర్తి సామర్థ్యం రోజుకు 167 మిలియన్ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను సరఫరా..  కానీ ఇప్పుడు రోజుకు కేవలం 33 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు మాత్రమే సరఫారా అవుతోంది. దీంతో ఈ గ్యాస్ పై ఆధారపడిన యూరప్ దేశాలు ఏం చేయాలో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నాయి.


అసలే అక్కడ శీతాకాలం రాబోతోంది. ఆ సమయంలో వాళ్లకు గ్యాస్‌ సరఫరా చాలా ప్రధానం.. ఇలాంటి సమయంలో ఇప్పుడు రష్యా ఇలాంటి ఆంక్షలు పెట్టడంతో యూరప్ దేశాలు అయోమయంలో పడ్డాయి. ఈ గ్యాస్ పైనే అటు పరిశ్రమలు, ఇటు గృహ అవసరాలు ఆధారపడి ఉన్నాయి. తమకు సరిపడా గ్యాస్‌ రావడం లేదని ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యూరప్‌లో శీతాకాలంలో ఇళ్లను వేడిగా ఉంచేందుకు గ్యాస్‌ వినియోగం ఎక్కువ. మరి ఇప్పుడు ఆ దేశాలు ఏం చేస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: