తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం వెనుక ఎందరిదో కృషి ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా సమష్టిగా పనిచేసింది. వీటిన్నింటిని తెర వెనుక వ్యూహాలు రచించి.. ఎత్తుకు పై ఎత్తులు వేసింది పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఉన్నారు. ఒకప్పుడు సాధారణ ప్రజల ఉద్దేశాలను కార్యకర్తలు పక్కాగా పసిగట్టి స్థానిక నాయకులకు సమాచారాన్ని అందజేసేవారు.


ఈ ప్రాంతంలో మనకి పట్టు ఉంది. ఫలానా చోట వెనుకబడి ఉన్నాం అని నిజాయతీగా చెప్పేవారు. వీళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులకు.. వారు అధిష్ఠానానికి తెలియజేసేవారు. వారు దానిపై ఏం చేయాలో అనేది స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు. వీరికి సామాన్య కార్యకర్తలతో కానీ పార్టీతో కానీ సంబంధం ఉండదు. డబ్బులు వెచ్చించి రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు.


దీంతో కింది స్థాయి కార్యకర్తల సూచనలు, సలహాలు వినే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేర్లు సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్(పీకే). గత 2019 ఎన్నికల్లో పీకే అండతో జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పీకే టీం పనిచేసింది. ఆయా పార్టీలకు విజయాన్ని సాధించి పెట్టింది.


సునీల్ కనుగోలు విషయానికొస్తే కర్ణాటకలో హస్తం పార్టీ విజయానికి ఆయన వ్యూహాలు ఫలించాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం అన్నీ తానై వ్యవహరించారు. మరోవైపు బీఆర్ఎస్ సర్కారు ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించినా అనివార్య కారణాలతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదు. ఎలాంటి వ్యూహకర్తలు లేకుండానే కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిచారు. సొంతంగా వ్యూహాలు రచించుకొని విజయవంతం కాలేకపోయారు. ఇక రాబోయే రోజుల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ల అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉండనుంది. వీరు లేకుంటే గెలిచే పరిస్థితి ఉండదు అనే స్థితికి రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: