తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సోనియా గాంధీ ఈ మేరకు తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించారు. బీఆర్ఎస్ వ్యతిరేకత, ఆకర్షణీయంగా ఉన్న ఆరు గ్యారంటీలతో హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.  అయితే ప్రభుత్వం కొలువుతీరిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల్లోని రెండు పథకాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది.


కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అంటూ కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి అంటూ మహిళలకు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత నిబంధనలు విధించారు. ప్రస్తుతం అమలవుతున్న ఉచిత ప్రయాణం కేవలం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకే పరిమితం చేశారు. ఇక హైదరాబాద్ లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.


సూపర్ లగ్జరీ, డీలక్స్, నాన్ స్టాప్, ఇంద్ర, గరుడ లాంటి సర్వీసుల్లో ఉచిత ప్రయాణాలు ఉండవని స్పష్టం చేశారు. పల్లె  వెలుగు బస్సులు పరిమిత కిలో మీటర్లు మాత్రమే తిరుగుతాయి. అంటే ఉచిత ప్రయాణం కూడా పరిమితమే అన్నమాట. ఇక ఎక్స్ ప్రెస్ ల్లో చాలా వరకు నాన్ స్టాప్ గానే తిరుగుతుంటాయి. దీంతో ఈ బస్సుల్లో ఉచితం ఉంటుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా డీలక్స్, రాజధాని, సూపర్ డీలక్స్, గరుడ లాంటి సర్వీసులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ బస్సుల్లో వారికి ఉచితం లేదు.  ఛార్జీలు చెల్లించాల్సిందే. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి కొన్ని షరతులు విధించిన ప్రభుత్వంపై మహిళల స్పందన ఏ విధంగా ఉందో ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: