అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రోజురోజుకూ రాజుకుంటుంది. ఎన్నికల బరికి ముందు సొంత పార్టీ నేతలతో పోటీ పడి వారిని ఓడించిన తర్వాతనే తుది పోరుకు అర్హత సాధిస్తారనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవిని చేపేట్టేందుకు పోటీ పడిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పట్టువీడని విక్రమార్కుడిలా తాజాగా జరిగే ఎన్నికల్లో మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.


ఇందులో భాగంగానే ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ఇంతకు ముందే షురూ చేయడంతో పాటు తాను గురి పెట్టిన విషయాన్ని తన సంచలన వ్యాఖ్యలతో స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ తో పోటీ పడుతున్న సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు సైతం తగ్గట్లేదు. ట్రంప్ తీరుపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన విమర్శలు ఒక ఎత్తైతే తాజాగా చేసినవి మరో ఎత్తులా భావించవచ్చు.  ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయినా.. లేక  జో బైడెన్ ఎన్నికయినా ఇద్దరూ వృద్ధాప్యంతో బాధపడేవారే.  ప్రపంచ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నప్పుడు 80 ఏళ్లు నిండిన వీరు మనకి అవసరమా అని ప్రశ్నించారు.


అయితే వీటిని సానుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న భారతీయ మూలాలున్న నిక్కీ హేలీ ట్రంప్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మానసిక పరిస్థితి బాలేదంటూ పెద్ద బాంబ్ పేల్చారు.  2021 జనవరి ఆరున అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక ఘటనను ఆపడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారన్నారు.  అంతకు ముందు ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాను ఎందుకు ఆ హింసాత్మక చర్యలకు బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు.


ఆ సమయంలో కనీసం ఆఫీసులో లేనని పేర్కొన్నారు. దీంతోనే ఆయన మానసిక స్థితి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఎంతో ఒత్తిడితో కూరుకున్న అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ మానసిక స్థితి సరిపోతుంతా అని ప్రశ్నించారు.  చూద్దాం మరి అమెరికన్లు ఎలాంటి తీర్పు ఇస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: