అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోకముందే ఆ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నల్గొండ కార్పొరేషన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పురపాలికలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సొంత పార్టీ మేయర్లు, ఛైర్మన్లు ఇలా వరుసగా అవిశ్వాసాలు ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పురపాలికలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.


ఇంకా అనేక మున్సిపాలిటీలు హస్తగతం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారంలో లేని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ జాబితాలో బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్ కార్పొరేషన్ కూడా చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లే పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్నారు.


బీఆర్ఎస్ పవర్ లో ఉన్నంత కాలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు చేసిన సదరు నేతలు.. ఇప్పడు పవర్ మారేసరికి కాంగ్రెస్ లో చేరేందుకు యత్నిస్తున్నారు. తాజాగా భువనగిరి, నేరేడుచర్ల కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ అస్త్రం అయితే ప్రతిపక్షాల మీద వాడారో ఇప్పుడు దానినే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రయోగిస్తోంది.  ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని నియంతృత్వ పాలన సాగించారు.


దీనిని సహించని తెలంగాణ ప్రాంత ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించి బుద్ధి చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి మినహా మరే ఇతర ఎమ్మెల్యేలు గెలవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా స్థానిక సంస్థల్లో ఇతర పార్టీ కౌన్సిలర్లను చేర్చుకొని పురపాలికలను చేజిక్కించుకుంటోంది. అయితే ఇప్పుడీ పురపాలికలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా.. పైగా దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో ప్రతి కూల ఫలితాలు చూపించే అవకాశం ఉంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతల్ని పార్టీలో చేర్చుకుంటే ఆ మురికి కాంగ్రెస్ కు అంటడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: