బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషితో 18 ఏళ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు రాజన్న సిరిసిల్ల వాసులు.  కేటీఆరే వీరి అందరికీ విమాన టికెట్లు సమకూర్చారు.  రెండు నెలల క్రితం దుండగుల లక్ష్మణ్ విడుదల కాగా.. రెండు రోజుల క్రితం శివరాత్రి హన్మంతు విడుదలై ఇంటికి చేరుకున్నారు.


తాజాగా మరో ఇద్దరు అన్నదమ్ములు మల్లేశం, రవిలు పెద్దూర్ గ్రామానికి చేరుకున్నారు. చందుర్తి గ్రామానికి చెందిన వెంకటేశ్ వచ్చే నెలలో విడుదల కానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వీరంతా ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళారు.  వీరు వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచెమెన్ హత్యకు గురయ్యారు.


దీంతో అక్కడే పనిచేస్తున్న జిల్లా వాసులు ఐదుగురు ఈ కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో వీరు పోలీసులకు ఏం చెప్పారో తెలియదు. కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అప్పీల్ కు వెళ్లగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్ చట్ట ప్రకారం కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే వీళ్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో 2011లో కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు.


నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా రూ.15లక్షల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ చట్టాలు మారడంతో వీరిక్షమాభిక్షను కోర్టు కొట్టేసింది. దీంతో కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా దుబాయ్ రాజు అపాయిట్ మెంట్ సాధించి ఈ కకేసులో క్షమాభిక్ష కోరడం కోసం అక్కడి అధికారులతో మాట్లాడారు. చివరకు జైలు నుంచి విడుదల చేయడానికి అక్కడి అధికారులు ఒప్పుకున్నారు. జైలు నుంచి వచ్చిన కుమారులను చూసిన తల్లిదండ్రులు మిమ్మల్ని మళ్లీ చూస్తామని అనుకోలేదని.. కేటీఆర్ దయతోనే ఇంటికి చేరారని.. కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: