పొత్తులో భాగంగా జనసేన ఆశించిన సీట్లు లభించలేదు. కానీ ఈ విషయంలో పవన్ కల్యాణ్ సంతృప్తిగా కనిపిస్తున్నారు. కూటమిలో ఓట్ల బదలాయింపుపై ప్రత్యేక దృష్టి సారించారు.  పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన మాటను వ్యతిరేకించే వారు తనవారు కాదని.. తన  వారైతే మద్దతు తెలుపుతారు అని స్పష్టంగా తేల్చి చెప్పారు.


అటు పార్టీలో  ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నట్లు.. తనకు ఇతర అవసరాలు లేవని చెప్పుకు రావడం విశేషం. పొత్తులో భాగంగా జనసేన కంటే టీడీపీ ప్రయోజనాల కోసమే పవన్ పాటుపడుతున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు మూడు ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో కాకినాడ పార్లమెంట్ ఒకటి. ఇక్కడ అభ్యర్థిగా సానా సతీశ్ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పైగా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.


దీంతో పాటు మచిలీ పట్నం జనసేనకే ఖరారైంది. ఇక్కడి నుంచి బాలశౌరి బరిలో ఉన్నారు. ఆయన ఇటీవల జనసేనలో చేరారు. టీడీపీ లో చేరాలని ముందుగా భావించినా.. టికెట్ రాదేమోనని ఉద్దేశంతో జనసేనలో చేరారనే ప్రచారం ఉంది. మరోవైపు 24 అసెంబ్లీ స్థానాలకు ఐదు చోట్లను జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఇక్కడ కూడా కొణతాల కృష్ణమూర్తి.. పార్టీతో సంబంధం లేని వ్యక్తే.


ఇంకా పొత్తులో భాగంగా జనసేన 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కనీసం ఇక్కడైనా మెజార్టీ స్థానాల్లో జనసేన జెండా మోసిన వారికి ఇస్తారా లేక.. అనేది సందేహంగా మారింది. ఇప్పటికే  కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు.  ఆయనే నరసాపురం అభ్యర్థి అని ప్రచారం లో ఉంది. అదే జరిగితే అక్కడ పదేళ్లుగా జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి. లేక టీడీపీ నుంచి జనసేనలో కొంతమంది నాయకుల్ని చేర్చుకొని వారికే సీట్లు ఇస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చిన పవన్ .. టికెట్ల విషయమై మాత్రం నోరు మెదపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: