సీఎం జగన్ మంత్రి వర్గంలో కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన మరోసారి పుంగనూరు నుంచి బరిలో దిగుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఎదురులేదు. 1994 నుంచి వరుసగా ఆయనే అక్కడి ప్రజాప్రతినిధిగా ఉంటున్నారు. అయితే కొన్నేళ్లుగా మంత్రిగా పెద్దిరెడ్డి ఉన్నా.. ఆయన తనయుడు మిధున్‌ రెడ్డి, తమ్ముడు, ఎమ్మెల్యే అయిన ద్వారకానాథ్‌రెడ్డిలదే జగన్‌ ప్రభుత్వంలో కీలక పాత్రగా మారింది.


మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు మాత్రమే కాకుండా రాయలసీమ నాలుగు జిల్లాల బాధ్యతలను చూస్తున్నారు. అంతే కాదు.. ఉభయగోదావరి జిల్లాల టికెట్ల వ్యవహారమంతా ఆయన తనయుడు మిధున్‌ రెడ్డి చూసుకున్నారంటే.. జగన్‌ పెద్దిరెడ్డి కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పుంగనూరులో 1994 నుంచి పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొనేస్థాయిలో ప్రత్యర్థులు లేకపోవడం కూడా ఆయనకు మరో ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.


ఇక్కడ కూటమి చల్లా  చల్లా రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డిపై పోటీకి దింపింది. అయితే ఆయన పెద్దిరెడ్డికి సరైన ప్రత్యర్థి కాదన్న వాదన వినిపిస్తోంది. అయితే బీసీ గళంగా కొత్తగా బీసీవై పార్టీ పెట్టిన బీసీ నేత బోడే రామచంద్ర యాదవ్‌ పెద్దిరెడ్డికి గట్టి పోటీయే ఇస్తున్నారు. ఆయన నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమాలపై పోరాడుతున్నారు. ఆయన నుంచి పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్న సమయంలో ఆయన మంగళగిరిలోనూ పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించడం విశేషం.


బోడే రామచంద్రయాదవ్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఆయన ఫోకస్‌ మంగళగిరిపైనే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈసారి కూడా పుంగనూరులో పెద్దిరెడ్డి జెండా ఎగరేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఈ ప్రాంతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుటుంబ పెత్తనం బాగా పెరిగిందని.. అక్రమాల దందా ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నా.. గట్టి ప్రత్యర్థి లేకపోవడం, బలంగా పాతుకుపోయిన నేత కావడంతో ఆయనకు ఎదురు ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: