40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు వ్యూహాలు ఇటీవల ఘోరంగా విఫలమవుతున్నాయి. జగన్ దూకుడుకు ఎలాగైనా అడ్డుకుట్ట వేయకపోతే రాజకీయ ఉనికికే ప్రమాదంగా మారుతున్న సమయంలో ఆయన తన అనుభవమంతా రంగరించి వ్యూహాలు రచిస్తున్నారు. జగన్‌ను ఓడించేందుకు ఏ గడప తొక్కేందుకైనా.. ఎన్ని మెట్లు దిగేందుకైనా చంద్రబాబు సిద్ధపడుతున్నారు.  ఎలాంటి హామీలు ఇచ్చేందుకైనా.. ఏం చేసేందుకైనా చంద్రబాబు రెడీ అంటున్నారు.


జగన్‌ను గద్దె దింపే వ్యూహాల్లో భాగంగానే ముందుగానే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకున్నారు. దాదాపు మోడీ, అమిత్‌షా కాళ్లు పట్టుకున్నంత పని చేసి పొత్తులకు ఒప్పించుకున్నారు. కర్ణాటకలో విజయవంతమైన సిక్స్ గ్యారంటీ ఫార్ములాను కాపీ కొట్టేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు.. ఎన్నికల్లో తన పార్టీ విధానాలు ప్రజలను ఒప్పించి గెలిపించుకునే ధైర్యం కానరాక.. పొత్తులు, ఎత్తులు, ఫార్ములాలను నమ్ముకుంటున్నారు.


జగన్‌ బటన్‌ నొక్కుడు పథకాలను పంచుడు పథకాలుగా వర్ణించి.. ఇలా చేస్తే ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఇన్నాళ్లూ విమర్శించిన అదే చంద్రబాబు ఇప్పుడు అంతకుమించి ఇస్తానంటూ ఆరు  గ్యారంటీల పాట పాడుతున్నారు. వాలంటీర్లను జగన్‌ ప్రైవేటు సైన్యం అంటూ నాలుగున్నరేళ్ల పాటు విమర్శలు గుప్పించిన అదే చంద్రబాబు ఇప్పుడు.. వాళ్లనే కొనసాగిస్తా.. జీతం పదివేలు చేస్తానని యూటర్న్‌ తీసేసుకున్నారు.


చంద్రబాబు ఇలా యూటర్న్‌ రాజకీయాలతో ఆత్మవిశ్వాసం కొరవడి కనిపిస్తున్నారు. ఇన్ని చేసినా  జగన్‌ను గద్దె దింపగలమా అన్న అపనమ్మకమే ఆయనలో కనిపిస్తోంది. జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా ముందు నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారు. అందరికంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. విపక్షాలన్నీ ఏకమై కూటమిగా రణరంగంలో దిగినా సింహం సింగిల్‌గానే వస్తుందని ధీమాగా ఉన్నారు. సోషల్ ఇంజినీరింగ్‌ చేస్తూ బీసీలకు పెద్ద పీట వేసి.. నా పాలనలో మేలు జరిగితేనే ఓటేయండని ప్రజలను ధీమాగా కోరుతున్నారు. సంక్షేమాన్నే నమ్ముకున్న జగన్‌.. పేదల పక్షపాతిగా మరోసారి బరిలో దిగుతున్నారు. మరి ఈ దిగ్గజాల పోరులో ఈసారి ఎవరు విజేతలవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: